జగన్‌ సంచలన వ్యాఖ్యలు.. షర్మిలను ఉద్దేశించేనా?

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలు చాలా కుట్రలు, కుతంత్రాలు చేస్తారని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

Update: 2024-01-03 09:28 GMT

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలు చాలా కుట్రలు, కుతంత్రాలు చేస్తారని హాట్‌ కామెంట్స్‌ చేశారు. పొత్తుల కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం కుటుంబాలను కూడా చీలుస్తారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు పొత్తులు ఎక్కువ పెట్టుకుంటారన్నారు. ఎన్నికల్లో గెలవడానికి అబద్ధాలు చెప్తారని, మోసపు హామీలు ఇస్తారని ప్రజలు వారి మాయలో పడొద్దని కోరారు. తనకు ప్రజల ఆశీస్సులు తప్ప దత్త పుత్రుడు, ఎల్లో మీడియా సహకారం లేదన్నారు. మిమ్మల్ని, ఆ దేవుడిని నమ్ముకుని తాను ఉన్నానని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కాకినాడలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు ఉత్సవాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో ప్రతిపక్షాలు కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తాయన్నారు. కుటుంబాలను సైతం చీల్చే ప్రయత్నాలు చేస్తారని తీవ్ర విమర్శలు చేశారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెన్షన్‌ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని సీఎం జగన్‌ గుర్తు చేశారు. అప్పుడు జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించేవారని విమర్శించారు. చంద్రబాబు, పవన్‌ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదని నిప్పులు చెరిగారు.

చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తానన్న దత్త పుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదని గుర్తు చేశారు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిలో పవన్‌ కు కూడా భాగస్వామ్యముందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు అవినీతిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమీ రాయవని ధ్వజమెత్తారు. చంద్రబాబు అవినీతిని ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చూపించవన్నారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనే దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిలో భాగస్వామి కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు అని పవన్‌ కళ్యాణ్‌ పై తీవ్ర విమర్శలు చేశారు.

రాబోయే రోజుల్లో చంద్రబాబు, దత్తపుత్రుడు కుట్రలకు తెరతీస్తారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారన్నారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. తనకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదన్నారు. తాను నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనేనని తెలిపారు.

కాగా జగన్‌ సోదరి షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండటం, ఆమెకు ఏపీ పీసీసీ పగ్గాలు ఇస్తున్నారనే వార్తల నేపథ్యంలోనే కుటుంబాలను చీలుస్తారంటూ జగన్‌ వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News