స్పీకర్‌ కు వైఎస్‌ జగన్‌ సంచలన లేఖ!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలయిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-25 09:12 GMT

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అఖండ విజయం సాధించిన ఆ పార్టీ ఈసారి కేవలం 11 సీట్లకే చాప చుట్టేసింది. ఈ నేపథ్యంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం అసెంబ్లీ సీట్లలో కనీసం పది శాతం సీట్లనైనా గెలుచుకుని ఉండాలంటున్నారు. అయితే 10 శాతం లెక్క ప్రకారం కనీసం 18 సీట్లను గెలుచుకుని ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కేదని అంటున్నారు.

ప్రతిపక్ష నేత హోదా దక్కినవారికి కేబినెట్‌ మంత్రి హోదా ఉంటుంది. ఆ మేరకు ప్రొటోకాల్, భద్రత, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో జగన్‌ కు ప్రతిపక్ష నేత హోదా ఇస్తారా, ఇవ్వరా అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఏపీ శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడుకు సంచలన లేఖ రాశారు. ఇటీవల మంత్రుల తర్వాత తనతో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత.. ముఖ్యమంత్రి తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టే తనతో మంత్రులు ప్రమాణస్వీకారం చేశాక ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయించారని అనుమానం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ తన లేఖలో కోరారు. విపక్ష పార్టీల్లో తమకే ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని జగన్‌ కోరారు. ఈ మేరకు చట్టంలో ఉందన్నారు. ప్రతిపక్ష నేతను మంత్రుల తర్వాత ప్రమాణస్వీకారం చేయించడం అసెంబ్లీ పద్ధతులకు విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు సాధించి ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని వైఎస్‌ జగన్‌ తన లేఖలో పేర్కొన్నారు. గతంలో పార్లమెంటులో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ ఈ నిబంధన పాటించలేదని వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు.

అధికార కూటమి, స్పీకర్‌ ఇప్పటికే తన పట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారని వైఎస్‌ జగన్‌ తన లేఖలో పేర్కొన్నారు. తనను చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు వీడియో ద్వారా వెలుగులోకి వచ్చాయని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో తనకు అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను అసెంబ్లీలో బలంగా వినిపించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదాను కల్పించాల్సిందిగా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడిని అభ్యర్థిస్తున్నానని తెలిపారు.

వాస్తవానికి ప్రతిపక్ష నేత హోదాకు సంబంధించి రాజ్యాంగంలోనూ ఎలాంటి నిర్వచనాలు లేవని అంటున్నారు. మొదటి లోక్‌ సభ స్పీకర్‌ జీవీ మౌలాంకర్‌ సభలో నాడు ఒక రూలింగ్‌ ఇస్తూ మొత్తం సీట్లలో కనీసం 10 శాతం సీట్లను సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి జీవీ మౌలాంకర్‌ మౌఖికంగా చెప్పినదానినే అంతా అనుసరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని రాసిన లేఖ విషయంలో అధికార కూటమి ప్రభుత్వం, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News