వైసీపీలో పోస్టు మార్టమ్ స్టార్ట్స్..!
వైసీపీ అధినేత జగన్.. ఈ నెల 19న బుధవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
వైసీపీ అధినేత జగన్.. ఈ నెల 19న బుధవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. తాజా ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపించారు. గెలిచిన వారు వద్దు.. ఓడినవారే రావాలంటూ.. ఆయన సందేశాలు పంపించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయిన 164 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎంపీ అభ్యర్థులు కూడా ఈ సమావేశానికి రానున్నారు. దీంతో రెండు విషయాలపై క్లారిటీ రానుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.
ఒకటి.. పార్టీలో ఏం చర్చిస్తారు? ఓటమికి ఎవరిని బాధ్యులను చేస్తారు? అనే విషయాలు. ఇప్పటి వరకు అయితే.. ఓటమి విషయంలో పార్టీ పెద్దగా జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా.. ఇప్పటి వరకు కూడా.. ఎలాంటి సందేశం కూడా ఇవ్వలేదు. పార్టీ నాయకులు మాత్రం.. ఓటమికి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన ధనుంజయరెడ్డి కారణమని.. వ్యాఖ్యానించారు. అలానే ఒకరిద్దరు.. జగన్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణమన్నారు.
మరికొందరు వలంటీర్ వ్యవస్థే పార్టీని ఓడించిందని చెప్పారు. వలంటీర్ల కారణంగానే.. నాయకులకు-ప్రజలకు మధ్య రిలేషన్ కట్ అయిపోయిందని కొట్టు సత్యనారాయణ వంటివారు చెప్పుకొచ్చారు. ఇలా.. ఎవరికి తోచిన విధంగా వారు కారణాలు వెతుక్కున్నారు. ఇక, ఇప్పుడు అసలు తరుణం వచ్చేసింది. స్వయంగా జగనే ఈ నాయకులను పిలిచి.. పోస్టు మార్టం చేసేందుకు రెడీ అయ్యారు. మరి ఆయన ఏం చెబుతారు? తీరు మార్చుకుందామంటారా? తాను చేసిందే కరెక్టని భావిస్తారా? అనేది చూడాలి.
ఇక, తాజాగా ఏర్పాటు చేస్తున్న విస్తృత స్తాయి సమావేశం వెనుక మరో కారణం.. పార్టీ నేతలను కాపాడు కోవడం. ఔనన్నా కాదన్నా.. రాజకీయాల్లో ఉన్నవారు.. వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే.. కోట్ల రూపాయల్లోనే రైసు మిల్లులు నడుతున్న వారు.. బియ్యం ఎగుమతి చేస్తున్నవారు ఉన్నారు. ఇతర జిల్లాల్లో ఆయాప్రాంతాలను బట్టి వ్యాపారాలు నడుస్తున్నాయి. దీంతో వీరికిఇప్పుడు వచ్చే ఐదేళ్లు సర్కారు దన్ను అవసరం. ఫలితంగా పక్క చూపులు చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జగన్ వారిని కాపాడుకునేందుకు ఈ సమావేశాన్ని వినియోగించుకుంటారనేచర్చ సాగుతుండడం గమనార్హం.