వైసీపీ అసెంబ్లీని ఫేస్ చేయదా ?

ఏపీ అసెంబ్లీ ఈ నెల 22 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ వస్తుందా రాదా అంటే ఇంకా స్పష్టత అయితే లేదు

Update: 2024-07-21 17:30 GMT

ఏపీ అసెంబ్లీ ఈ నెల 22 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ వస్తుందా రాదా అంటే ఇంకా స్పష్టత అయితే లేదు. కానీ వినుకొండలో జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే కనుక గవర్నర్ ప్రసంగానికి హాజరై శాంతి భద్రతల మీద సభలోనే ఆందోళన చేయాలని వైసీపీ వ్యూహరచన చేస్తోంది అని అంటున్నారు.

ఉభయ సభలను కలిపి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ విధంగా చూస్తే వైసీపీకి ఎమ్మెల్సీలు కూడా కలుపుకుని 41 మందికి పైగా సభ్యులు ఉంటారు. అది పెద్ద బలంగానే కనిపిస్తుంది. అలా తొలి రోజున ఆందోళన చేసి గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఏమి చేర్చిందో ఆయా అంశాల మీద అక్కడే వీలైతే సభలోపల లేదా మీడియా పాయింట్ వద్ద విమర్శలు చేయడం ద్వారా కొత్త ప్రభుత్వానికి ఝలక్ ఇవ్వాలని వైసీపీ ఆలోచిస్తోంది అంటున్నారు

ఇక ఆ మరునాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో వైసీపీ పాల్గొంటుందా అలాగే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సెషన్ లో ఉంటుందా అన్నది చర్చగానే ఉంది. ఎందుకంటే ఈ నెల 24న ఢిల్లీలో వైసీపీ ధర్నాకు పిలుపు ఇచ్చింది. దాంతో వైసీపీ కేవలం తొలి రోజు మాత్రమే సభకు వచ్చి వెళ్ళిపోతుందా అన్న డౌట్లు వస్తున్నాయి.

మొత్తం అయిదు రోజుల పాటు బడ్జెట్ సెషన్ సాగుతుంది. అంటే ఈ నెల 26 దాకా అన్న మాట. కానీ వైసీపీ మాత్రం ఈ మొత్తం అయిదు రోజులూ సభకు వచ్చే అవకాశాలు లేవనే అంటున్నారు. ఢిల్లీలో ధర్నా హడావుడి అన్నీ ముగించిని వచ్చేటప్పటికి బడ్జెట్ సెషన్ క్లోజ్ అవుతుంది.

అలా కావాలనే బడ్జెట్ సెషన్ కి అటెండ్ కాకుండా వైసీపీ ఈ ఎత్తుగడ వేసిందా అని అంతా అనుకుంటున్నారు. వైసీపీ అసెంబ్లీని ఫేస్ చేయడానికి ఎందుకు ఇష్టపడటం లేదు అన్న ప్రశ్నలూ వస్తున్నాయి. అయితే సభలో తమకు మాట్లాడేందుకు అవకాశాలు ఉండవని అలాగే అధికార పక్షం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

దీని మీదనే జనసేన నేత నాగబాబు జగన్ సభకు రావాలని ఆయన సభకు వస్తే కూటమి ఎమ్మెల్యేలు ఎవరూ ఆయనని ఏ ఒక్క మాటా అనకుండా చూస్తామని సెటైర్లు వేశారు. అంతే కాదు జగన్ అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారు అని కామెంట్స్ చేశారు. నిజానికి ఇలాంటి కామెంట్స్ ని తీసి పక్కన పెట్టేలా అయినా వైసీపీ వ్యవహరించాలి. సభకు హాజరై ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద నిలదీయాలి.

ఒకవేళ ప్రభుత్వం వైపు నుంచి ఇబ్బందులు ఎదురైతే అది ప్రజలు అంతా చూస్తారు కాబట్టి ఎవరికి తప్పు ఎవరిది ఒప్పు అన్నది గ్రహిస్తారని ఒక విధంగా వైసీపీకి సభకు హాజరవడమే మంచిదని అంటున్నారు. కానీ వైసీపీ మాత్రం ఈ బడ్జెట్ సెషన్ కి దూరంగానే ఉంటుంది అని చెప్పేందుకు ధర్నా కార్యక్రమం ఉంది. సభలో తాము ప్రవేశపెట్టే శ్వేత పత్రాలను ఎదుర్కొని సరైన జవాబు చెప్పేందుకు జగన్ కి ధైర్యం లేదని అందుకే సభకు రావడం లేదని టీడీపీ నేతలు కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈ సభా సమావేశాల ద్వారా వైసీపీ వైఖరి ఏమిటి అన్నది తెలిసిపోతుందని ఆ మీదట జరిగే అసెంబ్లీ సమావేశాలకు కూడా ఇది జవాబు అవుతుందని అంటున్నారు. సో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News