నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్...జనంలోకి బలంగా వెళ్తుందా...!?

ఉమ్మడి ఏపీగా ఉన్న విభజన ఏపీగా ఉన్నా ఏపీ రాజకీయ నేతలు అంతా కూడా అత్యధిక శాతం హైదరాబాద్ లోనే ఉంటారు

Update: 2024-02-24 00:30 GMT

ఉమ్మడి ఏపీగా ఉన్న విభజన ఏపీగా ఉన్నా ఏపీ రాజకీయ నేతలు అంతా కూడా అత్యధిక శాతం హైదరాబాద్ లోనే ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఉమ్మడి ఏపీకి హైదరాబాద్ క్యాపిటల్ కాబట్టి ఎవరు ఎక్కడ ఉన్నా ఎక్కడ నుంచి పోటీ చేసినా పెద్ద సమస్య అయితే కాలేదు.

కానీ ఏపీ రెండుగా విభజించబడి పదేళ్లు అవుతోంది. కొత్తల్లో ఏమో అనుకున్నా పదేళ్ల రాజకీయ జీవితంలో కూడా పార్టీల అధినేతలు కీలక నాయకులు ఏపీలో ఎక్కడో ఒకచోట సొంత నివాసాలను ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు అన్న ప్రశ్నలు సహజంగానే జనంలో వస్తాయి. కులం మతం ఎలాగో ప్రాంతం కూడా అతి పెద్ద రాజకీయ సెంటిమెంట్.

ఏపీలోని ఉమ్మడి పదమూడు జిల్లాలలో ఎక్కడో ఒక చోట ఉంటూ రాజకీయం చేయడం వేరు. ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ అంటూ ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం వేరు. పదవి ఇస్తే ఏపీలో ఉంటాం లేకపోతే లేదు అన్నా జనాలు ఒప్పుకోరు. జగన్ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్నా ఆయన ఏపీలోనే 2014 నుంచి 2019 దాకా తిరిగారు. ఇక చివరి మూడేళ్లూ పాదయాత్ర పేరుతో ఏపీ జనం మధ్యనే ఉన్నారు.

అంతే కాదు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని తాను ఏపీ వాసిని అనిపించుకున్నారు. అదే చంద్రబాబు విషయానికి వస్తే ఆయన ఉండవల్లిలో నివాసం సీఎం గా ఉన్నపుడు ఉండేవారు. అది కూడా వీకెండ్స్ కి హైదరాబాద్ వెళ్తూ సోమవారం నుంచి శుక్రవారం దాకా ఉండేవారు అని ప్రచారంలో ఉంది. విపక్షంలోకి వచ్చాక బాబు ఎక్కువ కాలం హైదరాబాద్ కే పరిమితం అయ్యారు.

కరోనా అనంతరం మాత్రం ఆయన ఏపీలో బాగానే తిరుగుతున్నా బాబు శాశ్వత నివాసం ఏమిటి అంటే హైదరాబాద్ అనే చెప్పేలా అయన వందల కోట్లతో అక్కడ భవనం కట్టుకున్నారు. అందులో కొంత సొమ్ము వెచ్చింది ఏపీలో ఏ విజయవాడలో కట్టుకుంటే వైసీపీ నేతల విమర్శలు తప్పేవి కదా అన్న మాట ఉంది. ఇక మూడున్నర దశాబ్దాల ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తి అయిన తరువాత కుప్పంలో బాబు ఒక ఇల్లు కట్టుకుంటున్నారు.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆయన సినీ హీరోగా అక్కడే తన వృత్తి వ్యాపారాలను నిర్వహించాల్సి ఉంది. అయితే పవన్ కూడా మంగళగిరిలోని పార్టీ ఆఫీసు తో పాటు నివాసం ఏర్పాటు చేసుకుంటారు అని వినిపించింది. కానీ అది పూర్తి స్థాయిలో సాగలేదు. బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి అత్తమామలది ప్రకాశం జిల్లా అయినా ఆమె కూడా హైదరాబాద్ నుంచే వస్తూ పోతూ ఉంటారు. అక్కడే ఇల్లు ఉంది అని చెబుతారు. కొత్తగా పీసీసీ చీఫ్ అయిన షర్మిల కూడా కేరాఫ్ హైదరాబాద్ గానే ఉంటున్నారు అని చెప్పాల్సి ఉంది.

ఇలా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అయిన నేతలు వీరంతా అంటూ జగన్ ప్రతీ సభలోనూ జనంలో చర్చకు పెడుతూంటారు. తాజాగా ఆయన ఒంగోలులో జరిగిన సభలో కూడా ఇదే విషయం ప్రస్థావించారు. సొంత ఊరు ఏదో తెలియదు, అంతా పక్క రాష్ట్రం నుంచి వస్తారు, ఈ నాన్ ఆంధ్రా రెసిడెంట్స్ మనకు అవసరమా అని జగన్ సూటిగానే జనాలను ప్రశ్నించారు. వీరంతా వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు అని జగన్ నిందించారు.

చంద్రబాబుకు మద్దతుగా ఉన్న వారు అంతా ఏపీకి చెందిన వారు కాదని పొరుగు రాష్ట్రం వారేనని కూడా జగన్ అంటున్నారు. ఇలా జగన్ పదే పదే ఈ విషయం చెప్పడం వెనక ఉద్దేశ్యం వెరీ సింపుల్. ఎక్కడో ఉన్న వారిని ఎన్నుకోవద్దు. ఏపీలోనే ఉన్న తనను గెలిపించాలని. రాజకీయాల్లో లోకల్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. మరి జనాలకు అది సెంటిమెంట్ కూడా దాన్ని తెలివిగా వైసీపీ అధినేత తట్టి లేపుతున్నారు. మరి ఈసారి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ స్లోగన్ గట్టిగా పనిచేస్తుందా. చూడాల్సిందే.

Tags:    

Similar News