షర్మిళతో జగన్ మళ్లీ గిల్లికజ్జాలు!

ఈ సమయంలో.. తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన జగన్.. నేరుగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు. దీనిపై షర్మిళ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

Update: 2024-07-27 06:21 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికొచ్చే సరికి వైఎస్ జగన్ పేరు చెబితే.. మిగిలినవారి కంటే ఎక్కువగా అన్నట్లుగా వైఎస్ షర్మిళ విరుచుకుపడిపోతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జగన్ పై పలు అంశాలమీద ఆమె తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుత అధికార పక్షం నేతలు స్పందించేలోపే ఆమె ఫైరవుతున్నారన్నా అతిశయోక్తి కాదేమో!

ఉదాహరణకు... ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు. దానికి సంబంధించిన ప్రకటన వచ్చీ రాగానే వైఎస్ షర్మిల స్పందించారు. ఈ సందర్భంగా పలు సూటి ప్రశ్నలు సంధించారు. ఇందులో భాగంగా... నాడు ప్రత్యేక హోదా కోసం కానీ, పోలవరం ప్రాజెక్ట్ నిధుల కోసం కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ పై కానీ ఎందుకు ధర్నా చేయలేదని నిలదీశారు!

ఇదే సమయంలో... తమకున్న సమాచారం ప్రకారం వినుకొండలో జరిగింది వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన హత్య అని.. ఎవరో ఇద్దరు తమకున్న కక్షలతో నరుక్కుని చస్తే దానిపై ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తానని చెబుతున్న జగన్.. సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యగావింపబడినప్పుడు ఢిల్లీకి వెళ్లి, అక్కడ ఎందుకు ధర్నా చేయలేదో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. కార్యకర్తలే తప్ప ప్రజలు జగన్ కు ముఖ్యం కాదా అని నిలదీశారు!

ఇలా సమయం ఏదైనా, సందర్భంగా మరేదైనా... జగన్ చేసే ప్రతీ చర్యకూ, ప్రతిచర్య షర్మిళ నుంచి స్పాట్ లో వీలైనంత స్ట్రాంగ్ గా వచ్చేస్తుంది! ఇందులో భాగంగా... ఆన్ లైన్ వేదికగా ఓ పోస్ట్ పెట్టో, నేరుగా ఓ ప్రెస్ మీట్ పెట్టో జగన్ ను షర్మిళ కడిగిపారేస్తున్నారు. ఈ సమయంలో.. తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన జగన్.. నేరుగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు. దీనిపై షర్మిళ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

అవును... ఏపీలో కూటమి ప్రభుత్వం వరుసగా విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై వైఎస్ జగన్ స్పందించారు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు.. వివరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో తాను తలపెట్టిన ధర్నాకు ఇండియా కూటమికి సంబంధించిన పలు పార్టీల నేతలు రావడం, కాంగ్రెస్ నుంచి ఎవరూ రాకపోవడం, కనీసం స్పందించకపోవడంపై ప్రశ్న ఎదురైంది జగన్ కు!

ఈ సందర్భంగా స్పందించిన జగన్... తాను ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు రాలేదో వారినే అడగాలని అన్నారు. ఇదే సమయంలో... చంద్రబాబుకు – కాంగ్రెస్ కు ఉన్న సంబంధం ఏమిటి.. రేవంత్ ద్వారా ఆ పార్టీ పెద్దలతో చంద్రబాబు ఎలా కాంటాక్ట్ లో ఉన్నారనేది ఆ పార్టీనేతలే చెప్పాలని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు, అన్యాయాలపై మాట్లాడేవారితోనే కలిసి నడుస్తామని స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో... మణిపూర్ లో దారుణాలపై ధ్వజమెత్తే కాంగ్రెస్ నేతలు.. అలాంటి అరాచకాలే ఏపీలో జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ఈ కామెంట్స్ పై షర్మిళ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆమె ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా... ఢిల్లీల్లో తాము చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చేప్పాలంటున్న జగన్ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి అని ఎదురు ప్రశ్నించారు షర్మిల. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా.. లేక, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా అని అడిగారు.

ఇదే సమయంలో... ఐదేళ్ల పాటు బీజేపీతో అక్రమ సంబందం పెట్టుకుని.. విభజన హక్కులను, ప్రత్యేక హోదాను వారికి తాకట్టు పెట్టి.. ఆఖరికి మణిపూర్ ఘటనపై కూడా నోరెత్తని మీకు ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం అని అన్నారు. క్రీస్టియన్ అయ్యి ఉండి కూడా క్రైస్తవులను ఊచకోతకు గురిచేసినా నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వస తీర్మానంలో బీజేపీకి మద్దతు ఇచ్చారు కదా అని నిలదీశారు.

అదేవిధంగా వైఎస్సార్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకే జైకోట్టారు కదా.. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి వచ్చిందా సంఘీభావం..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిళ. ఈ నేపథ్యంలోనే... మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప రాష్ట్రానికి కలిగే ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే... నాడు "సిద్ధం" అనవాళ్లకు 11 మంది బలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు అని ప్రశ్నలతో కూడిన ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిళ!

Tags:    

Similar News