జగన్ ఊహించని రాజీనామా ఆయనదే ?
వైసీపీ పుట్టిన నాటి నుంచి అంటే పునాదుల నుంచి ఉన్న నేత మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.
వైసీపీ పుట్టిన నాటి నుంచి అంటే పునాదుల నుంచి ఉన్న నేత మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. జగన్ కి అత్యంత సన్నిహితుడు. ఎంతలా అంటే 2014 ఎన్నికల్లో ఆళ్ళ నాని ఎమ్మెల్యేగా ఓటమి చెందినా ఎమ్మెల్సీ చాన్స్ ఆయనకే ఇచ్చేంతలా. జగన్ అంటే నానికీ అంతే విధేయత ఉంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రెండు సార్లు గెలిచారు. ఇక 2009లో ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా తరువాత కాలంలో వైసీపీలోకి వచ్చారు. ఆయన వైసీపీ నుంచి 2014లో ఓడినా 2019లో గెలిచారు. గెలిచిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పదవిని కీలకమైన వైద్య ఆరోగ్య శాఖలతో జగన్ ఇచ్చారు.
ఇక ఆ పదవిలో మూడేళ్ల పాటు నాని ఉన్నారు. 2022లో ఆయనను తప్పించారు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తి చెందారని వార్తలు అప్పట్లో వచ్చాయి. అయితే ఆ తరువాత జగన్ పిలిచి మాట్లాడడంతో మెత్తబట్టారు. ఇక 2024లో ఆయనకు టికెట్ ఇవ్వరని అనుకున్నారు. ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ ఏలూరు సీటుని ఆశించారు అని కూడా ప్రచారం సాగింది.
అయితే ఆళ్ళకే ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. కానీ ఆయన బడేటి రాధాక్రిష్ణయ్య చేతిలో భారీ తేడాతో ఓటమి పాలు అయ్యారు. పార్టీ కూడా ఘోర పరాజయం చెందింది. ఆ తరువాత నుంచి రెండు నెలల పాటు మౌనంగా ఉన్న ఆళ్ల నాని చివరికి రాజీనామా బాంబు పేల్చారు. తన వ్యక్తిగత కారణాలతో పార్టీకి దూరం అని ఆయన చెప్పారు.
మరి ఆయన మనసులో ఏముందో తెలియదు కానీ వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు. ఆయన 2014 నుంచి 2019 దాకా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని గెలిపించారు. తిరిగి 2022 నుంచి ఆ బాధ్యతలను తీసుకున్నారు. మధ్యలో మూడేళ్ళు తప్ప మొత్తం వైసీపీ జిల్లా సారధిగా ఆయనే ఉన్నారు. పార్టీ గెలుపు ఓటములను ఆయనే నిర్ణయించేలా నడిపించారు.
మరి జగన్ కి అతి సన్నిహితుడు గోదావరి జిల్లాలో ఆయనకు ఇష్టుడు అయిన ఆళ్ళ నాని రాజీనామా చేయడం వైసీపీకి షాక్ గా మారింది. జగన్ సైతం ఇది ఊహించని రాజీనామా అని అంటున్నారు. జగన్ సీఎం గా ఉన్నపుడు గడప గడపకు అని కార్యక్రమం నిర్వహించమని ఎమ్మెల్యేలను జనంలోకి పంపించేవారు. ఆ టైం లో పెద్దగా జనంలోకి వెళ్లని వారిగా నాని పేరు కూడా ఉండేది.
ఆళ్ల నాని జనంలో ఎక్కువగా తిరగరు అని కూడా అంటూంటారు. ఆయన నిజాయితీపరుడిగా విధేయుడిగా ఉన్నారన్న పేరు కూడా ఉంది. అందుకే జగన్ ఆయన్ని మెచ్చుకునేవారు. పదవులు కూడా కట్టబెట్టారు. అయితే తాజా ఓటమిని ఆళ్ల జీర్ణించుకోలేదని అంటున్నారు. అంతే కాదు ఆయన రాజకీయాల పట్ల వైముఖ్యం పెంచుకున్నారు అని అంటున్నారు.
మళ్లీ ఆయన రాజకీయాల్లోకి వస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. ఆయన వస్తే జనసేన పార్టీయే ఉంది. ప్రస్తుతానికి చూస్తే బడేటి ఫ్యామిలీకి ఏలూరు పెట్టని కోట. టీడీపీలో అయితే ఖాళీ లేదు. పొత్తులు లేకపోతే జనసేన నుంచి చాన్స్ ఉంటుంది. లేకపోతే మరో నియోజకవర్గం అయినా జనసేన ఇస్తుంది.
మరి ఈ ఆలోచనలతో ఇపుడే తొందరపడకుండా కొన్నాళ్ళు వేచి చూడాలన్న ఉద్దేశ్యంతోనే ఆళ్ళ రాజీనామా చేశారా అన్న చర్చ సాగుతోంది. ఆళ్ళ రాజీనామా వైసీపీ శ్రేణులను సైతం నిరాశలో నింపింది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారు జగన్ కి కుడి భుజం లాంటి వారే జారిపోతే భవిష్యత్తు మీద బెంగ క్యాడర్ కి ఇంకా పెరుగుతోందని అంటున్నారు. మొత్తానికి ఆళ్ళ రాజీనామా సైలెంట్ గా చేసినా అది వైసీపీలో ప్రకంపనలే సృష్టిస్తోంది.ఆయన దారిని ఇంకెంతమంది పడతారో అన్న చర్చ కూడా సాగుతోంది.