పేరును సైతం తడబడేంత వేదన జగన్ లో ఉందా?

ఎలాంటి జగన్? మరెలా ఉన్నారు. ఓటమి వేదనను అర్థం చేసుకోవచ్చు.

Update: 2024-06-22 04:17 GMT

ఎలాంటి జగన్? మరెలా ఉన్నారు. ఓటమి వేదనను అర్థం చేసుకోవచ్చు. కానీ.. సదరు ఓటమి అత్యంత దారుణంగా.. దయనీయంగా ఉన్నప్పుడు జగన్ లాంటి స్ట్రాంగ్ పర్సనాలిటీ ఎలా తీసుకుంటారు? అన్న దానికి ఇప్పటి వరకు ఆన్సర్ లేదు. తిరుగులేని హీరోయిజంతో పాటు.. తన సభ అంటేచాలు లక్షలాది మంది ఇట్టే వచ్చేసే ఛరిష్మా ఉన్న నాయకుడిగా పేరున్న జనసేనాని పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో రెండుస్థానాల్లో పోటీ చేయటం తెలిసిందే. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలైన వైనం షాక్ కు గురి చేసింది.

అలాంటి షాకింగ్ ఓటమి గురించి పవన్ పలుమార్లు చెప్పుకున్నారు. తన ఓటమిని ఒప్పుకోవటమే కాదు.. జీర్ణించుకోవటానికి 24 గంటలు పట్టిందని.. ఆ తర్వాత మామూలైపోయినట్లుగా చెప్పుకున్నారు. మరి..151 ఎమ్మెల్యేల బలంతో పవర్ లోకి వచ్చి.. ఐదేళ్లు పాలన అందించి..ఆ ఆత్మవిశ్వాసంతో వైనాట్ 175? అంటూ ఎన్నికల బరిలోకి దిగిన జగన్ కు కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఇస్తూ ప్రజాతీర్పు వెలువడటం తెలిసిందే.

ఈ నెల నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసే నాటికి దగ్గర దగ్గర పదిహేను రోజులు దాటిపోయాయి. కానీ.. ఆయన మాత్రం తనకు ఎదురైన దారుణ ఓటమి నుంచి బయటకు రాలేదన్న విషయం తాజాగా అందరికి అర్థమైపోయింది. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు వచ్చిన జగన్.. ప్రమాణస్వీకార వేళ.. తన పూర్తి పేరును పలికే విషయంలోనూ తడబాటుకు గురయ్యారు.

వైఎస్ జగన్ అనే నేను అంటూ.. తన పేరును పూర్తిగా పలకటంలో తాను పొరపడ్డ విషయాన్ని అర్థం చేసుకొని.. కాస్తంత పాజ్ ఇచ్చి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణాన్ని పూర్తి చేశారు. ఇదొక్క ఘటన చాలు.. ఎన్నికల్లో ఓటమి ఆయన్ను ఎంతలా వేధిస్తుందన్న విషయంపై క్లారిటీ రావటానికి. ఓటమి వేదనను కలిగిస్తుంది. తాజా ఎన్నికల్లో జగన్ లాంటి అధినేతకు ఎదురైన ఘోర పరాజయాన్ని జీర్ణించుకోవటం కష్టమే.కానీ.. దీన్ని అధిగమించి మళ్లీ ఎగిసిపడటమే అసలుసిసలు సవాలు. దాన్ని సాధించాలంటే ముందు తనకు ఎదురైన ఘోర పరాజయాన్ని గుండెల్లో నుంచి తీసేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆయన్ను అభిమానించే వారికి సైతం కొత్త ఆశలు కలిగేలా చేస్తుంది.

Tags:    

Similar News