టార్గెట్ ష‌ర్మిల‌: అటు నుంచి న‌రుక్కొస్తున్న జ‌గ‌న్‌ ?

మ‌రి ఇప్పుడు ఏం చేయాలి? అస‌లు శ‌త్రువు.. పైకి క‌నిపిస్తున్న కూట‌మి అయినా.. అంతః శ‌త్రువు.. మా త్రం ష‌ర్మిలేన‌న్న‌ది వైసీపీ గుర్తించిన తాజా స‌త్యం.

Update: 2024-07-26 05:51 GMT

మైకు ప‌ట్టుకుంటే.. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల తూటాలు. మీడియా ముందుకు వ‌స్తే.. వ‌దిలి పెట్టకుండా.. ఏకుడే ఏకుడు! గ‌తం-వ‌ర్త‌మానం.. అన్న తేడా లేదు.. మొత్తంగా 'క‌లిపి కొట్ట‌రా కావేటి రంగా!' అన్న‌ట్టుగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. త‌న అన్న వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌ను ఏకేస్తున్న విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల‌కు ముందు అధికారంలో ఉన్నాడు.. కాబ‌ట్టి.. ఏకేశారంటే అర్థం ఉంది. కానీ, ఎన్నిక‌లు అయిపోయి.. 11 స్థానాల‌కు ప‌రిమిత‌మైన త‌ర్వాత కూడా.. ష‌ర్మిల వ‌దిలి పెట్ట‌డం లేదు.

ఢిల్లీలో ధ‌ర్నా- అని జ‌గ‌న్ అంటే.. ఎవ‌రి కోసం చేస్తున్న‌వ్‌. వివేకాను హ‌త్య చేసిన‌ప్పుడు ఎందుకు చేయలే. ప్ర‌త్యేక హోదా కోసం ఎందుకు చేయ‌లే. పోలవ‌రం నిధుల కోసం ఎందుకు చేయ‌లే.. అంటూ.. అధికార ప‌క్షం కూట‌మి పార్టీల నాయ‌కుల కంటే కూడా.. దూకుడుగా అన్న‌పైకి మాట‌ల తూటాలు పేల్చేసింది ష‌ర్మిల‌క్క‌!! నిజానికి కూట‌మి పార్టీల నేతలు చేసే విమ‌ర్శ‌ల‌కైనా స‌మాధానం చెప్పుకోవ‌చ్చేమో.. కౌంట‌ర్ ఇచ్చుకోవ‌చ్చేమో.. కానీ, ష‌ర్మిల కౌంట‌ర్ ఇచ్చేందుకు కూడా స్కోప్ లేకుండా వాయించేస్తోంది!!.

మ‌రి ఇప్పుడు ఏం చేయాలి? అస‌లు శ‌త్రువు.. పైకి క‌నిపిస్తున్న కూట‌మి అయినా.. అంతః శ‌త్రువు.. మా త్రం ష‌ర్మిలేన‌న్న‌ది వైసీపీ గుర్తించిన తాజా స‌త్యం. అందుకే చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసి.. ఉభ య కుశ‌లోప‌రి అన్న‌ట్టుగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించి ఉంటార‌ని.. జాతీయ మీడియా అనుమానం వ్య‌క్తం చేస్తోం ది. దీనికి సంబంధించి ఒక‌రిద్ద‌రు జాతీయ విశ్లేష‌కులు చేసిన వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నిస్తే.. ఢిల్లీలో ధ‌ర్నా చేసిన జ‌గ‌న్‌.. త‌న ధ‌ర్నా కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి పార్టీల‌ను ఆహ్వానించారు.

వారంతా వ‌చ్చారు. జ‌గ‌న్‌కు ద‌న్నుగా నిలిచారు. ఇలా.. చేయడం వెనుక జ‌గ‌న్ వ్యూహం.. 'అవ‌స‌ర‌మైతే.. నేను మీవెంటే' అన్న సంకేతాలు ఇవ్వ‌డం. అంటే.. రేపు మోడీని దీటుగా ఇండియా కూట‌మి ఎదుర్కొనాల్సి వ‌స్తే.. ప‌రోక్షంగానో.. ప్ర‌త్య‌క్షంగానో.. జ‌గ‌న్‌వారికి స‌హ‌క‌రించే అవ‌కాశం ఉంటుంద‌న్న సంకేతాల‌ను వైసీపీ అధినేత పంపించార‌న్న‌ది జాతీయ విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. ద‌క్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఎన్డీయూ కూట‌మి అధికారంలో ఉంది. కాబ‌ట్టి చంద్ర‌బాబు ఎలానూ త‌మ‌తో క‌లిసివ‌చ్చే అవ‌కాశం లేదు.

సో.. ఎటూ కాకుండా.. త‌ట‌స్థంగా ఉన్న‌ది జ‌గ‌న్ ఒక్క‌రే. కాబ‌ట్టి.. ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా.. రేపు 'ఏదైనా' అవ‌స‌రం ఏర్ప‌డితే.. ఆయ‌న‌ను వినియోగించుకునేందుకు ఇండియా కూట‌మి నాయ‌కులు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశార‌ని అంటున్నారు. ఇక‌, ఇక్క‌డ జ‌గ‌న్ ఆశిస్తున్న‌ది.. త‌న చేతుల‌కు మ‌ట్టి అంట‌కుండా.. ఇండియా కూట‌మిలో త‌న‌ను స‌మ‌ర్ధించేందుకు వ‌చ్చిన వారి ద్వారా కాంగ్రెస్‌ను లైన్‌లో పెట్టి.. ఏపీలో ష‌ర్మిల దూకుడును త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న‌ది జాతీయ విశ్లేష‌కుల అంచ‌నా.

అంటే.. ఇక్క‌డ నేరుగా జ‌గ‌న్ జోక్యం ఉండ‌దు. ఇండియా కూట‌మి పార్టీలు ఎలానూ త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చాయి కాబ‌ట్టి.. రేపు వారికి కూడా ఆయ‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌నే సంకేతాలు ఇచ్చారు. ఇదేస‌మ‌యంలో ష‌ర్మిల‌ను ఆయ‌న వారితోనే(ఇండియా కూట‌మి పార్టీల కీల‌క నేత‌ల‌తో) కాంగ్రెస్‌కు చెప్పించి.. ష‌ర్మిల‌ను క‌ట్ట‌డి చేసే వ్యూహం ఉంద‌న్న‌ది వీరి మాట‌. ఇదే క‌నుక జ‌రిగితే.. కాంగ్రెస్‌కు కూడా.. ఇప్ప‌టికిప్పుడు త‌మ‌కు మ‌ద్ద‌తిచ్చే త‌ట‌స్థ పార్టీల అవ‌స‌రం ఉంది కాబ‌ట్టి.. మిత్ర ప‌క్షాల ద్వారా..జ‌గ‌న్ చేయించే ప్ర‌య‌త్నానికి స‌మ్మ‌తించినా.. స‌మ్మ‌తించ‌వ‌చ్చు.. త‌ద్వారా ష‌ర్మిల దూకుడును క‌ట్ట‌డి చేయొచ్చు. మ‌రి ఈ విశ్లేష‌ణ నిజ‌మేనా? భ‌విష్య‌త్తులో అలానే జ‌రుగుతుందా? జ‌గ‌న్ వేసి అడుగు ఫలించి.. చెల్లి మెల్లిమెల్లిగా వెనక్కు త‌గ్గుతుందా? అనేది చూడాలి.

Tags:    

Similar News