ప్రజాస్వామ్యానికి పెనుముప్పు వచ్చింది: వైఎస్ జగన్
చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చిందని.. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాల అనంతరం గొడవలు, అల్లర్లు, దాడులు పెచ్చుమీరుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడుతున్నారు. వారిపై పలు చోట్ల టీడీపీ కార్యకర్తలు విచక్షణా రహితంగా చేస్తున్న దాడులు భయాందొళనలు కలిగిస్తున్నాయని అంటున్నారు. ఇదే క్రమంలో నేతల ఇళ్లపైనా దాడులు చేస్తున్నారు.
ఇందులో భాగంగా మాజీమంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మొదలైన నేతల ఇళ్లపై దాడులు జరిగిన పరిస్థితి. అయితే ఈ గొడవలకు కారణం మీరంటే.. మీరు అంటూ టీడీపీ, వైసీపీ నేతలు ఆరోపణలుచేసుకుంటున్నారు. వైసీపీ వాళ్లు కావాలనే కవ్వింపుచర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మరోపక్క... ఓడిన వాళ్లు ఎవరైనా గెలిచినవారిపై కవ్వింపు చర్యలకు పాల్పడతారా.. ఏదో ఒక సాకు చూపించి అమాయక వైసీపీ కార్యకర్తల్ని హింసిస్తున్నారని వైసీపీ అంటోంది. వాస్తవాలను ఒకవర్గం మీడియా వక్రీకరించినా.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని నమ్మకంగా చెబుతోంది. ఈ దారుణాలపై వెంటనే జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరుతుంది.
ఈ సమయంలో తాజా పరిస్థితులపై వైఎస్ జగన్ స్పందించారు. ఇందులో భాగంగా... రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని.. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చిందని.. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయని అన్నారు.
ఇదే సమయంలో ఏపీలో యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయిందని.. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై ఉనాదంతో దాడులు చేస్తున్నారని తెలిపారు. పార్టీనుంచి పోటీ చేసిన అభ్యర్థులకు సైతం రక్షణ లేకుండా పోయిందని.. ఉన్నత చదువులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లోనూ ఆచార్యులపై దౌర్జ్యన్యాలకు దిగి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని జగన్ ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక గడిచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా... ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకూ తీవ్ర భంగం వాటిల్లుతోందని అన్నారు.
ఈ సందర్భంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈ విషయాలపై జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు జగన్. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు వైఎస్సార్సీపీ తోడుగా ఉంటుందని భరోసా ఇస్తున్నట్లు జగన్ తెలిపారు.
కాగా... రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని.. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల నాయకులు సైతం అలెర్ట్ గా ఉండి, ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలి. వైసీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన పార్టీ కార్యకర్తలు పూర్తి సంయమనం పాటించాలని కోరారు.
దీంతో... గొడవలకు కారణం వైసీపీ శ్రేణులే అని చంద్రబాబు చెప్పినా.. కాదు కాదు.. జరుగుతున్న దారుణాలకు టీడీపీ శ్రేణులే కారణం అని జగన్ చెప్పినా.. నిజంగా ఎవరు కారణం అయినా.. ఏపీలో ప్రజాస్వామ్యం మాత్రం ఇబ్బందుల్లోకి నెట్టబడుతుందనే విషయాన్ని ఇరుపార్టీల శ్రేణులూ గమనించాలి. ఈ విషయంలో అధికార పార్టీ శ్రేణులకు మరింత ఎక్కువ బాధ్యత ఉంటాదనే విషయం మరిచిపోకూడదని అంటున్నారు పరిశీలకులు!