రేవంత్ కు జగన్ విషెస్... మోడీ, హరీష్, పవన్ రియాక్షన్ ఇదే

ఈ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. కేంద్రం నుంచి, పొరుగు రాష్ట్రాలు నుంచి శుభాకాంక్షలు వెలువడ్డాయి.

Update: 2023-12-07 12:16 GMT

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తాజాగా ప్రమాణస్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణుల హర్షధ్వానాల నడుమ... "ఎనుముల రేవంత్ రెడ్డి అను నేను..." అంటూ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. కేంద్రం నుంచి, పొరుగు రాష్ట్రాలు నుంచి శుభాకాంక్షలు వెలువడ్డాయి.

అవును... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ ఎంపికైన అనంతరం శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ప్రధానంగా మరో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి రాలేకపోయినప్పటికీ... ఆన్ లైన్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఈ ట్వీట్ తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

"తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు!

ఇదే క్రమమో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. రేవంత్ కు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా... "తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను" అంటూ ప్రధాని మోడీ తెలుగులో ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగతంగా స్నేహం ఉందని పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు! అనంతరం సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా... ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సక్సెస్ ఫుల్ గా పనిచేయాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు.

ఇదే క్రమంలో తెలంగాణలో ప్రతిపక్ష నేతలు కూడా సీఎం రేవంత్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నానంటూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. అదేవిధంగా... రేవంత్ రెడ్డికి ఆయన మంత్రి వర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News