మహేషే ఎందుకంటే... టీపీసీసీ చీఫ్ ఎంపికపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయనకు ఈ విధంగా పదోన్నతి కల్పించారు. అంటే... తెలంగాణ ఏర్పడిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య, ఉత్తం కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిల తర్వాత నాలుగో పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియమితులవ్వడంపై జగ్గారెడ్డి స్పందించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన... బీసీ నేతకు టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) భావించింది.. అందుకు మహేష్ కుమార్ గౌడ్ ను నియమించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఏఐసీసీకి జగ్గారెడ్డి ధన్యవాదాలు చెబుతున్నట్లు ప్రకటించారు.
ఈ సమయంలోనే అను తానుకూడా టీపీసీసీ అధ్యక్షుడు కావాలనుకున్నట్లు చెప్పిన ఆయన.. తాను ఎప్పటికైనా అవుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పెద్ద పార్టీ అని.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరైనా కావొచ్చని తెలిపారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నెత ముఖ్యమంత్రి కావడంతో.. బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకు పీసీసీ పదవి దక్కిందని తెలిపారు.
ప్రధానంగా బీసీలకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం దక్కిందని చెప్పిన జగ్గారెడ్డి... ఈ పదవి కోసం అన్ని సామాజికవర్గాల నుంచి చాలా మంది నేతలే పోటీ పడ్డారని తెలిపారు. ఇందులో భాగంగా... బీసీ ల నుంచి మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి ఉండగా.. ఎస్సీ సామాజికవర్గం నుంచి సంపత్, లక్ష్మణ్ ఉన్నారని అన్నారు.
ఇదే సమయంలో ఎస్టీ సామాజికవర్గం నుంచి శంకర్, బలరాం నాయక్ ల పేర్లను పరిశీలించారని.. అయితే, బీసీ సామాజికవర్గ నేతకు ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే మహేష్ కుమార్ గౌడ్ కు ఆ పదవి ఇచ్చారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
కాగా... గతంలో 2004 నుంచి 2014 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన డి. శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే.. ఇప్పుడు తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ కే ఈ పదవి దక్కడం గమనార్హం.