కాంగ్రెస్ కు జమాత్ జిందాబాద్ ... కానీ ట్విస్టుంది
తెలంగాణా ఎన్నికలు దగ్గర పడేకొద్దీ సామాజిక వర్గాల ఓట్లు పోలరైజవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ కే తమ మద్దతని జమాత్-ఏ- ఇస్లామీ-హింద్ ప్రకటించటం సంచలనంగా మారింది.
తెలంగాణా ఎన్నికలు దగ్గర పడేకొద్దీ సామాజిక వర్గాల ఓట్లు పోలరైజవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ కే తమ మద్దతని జమాత్-ఏ- ఇస్లామీ-హింద్ ప్రకటించటం సంచలనంగా మారింది. ఈ మధ్యనే కాంగ్రెస్ మద్దతిస్తున్నట్లు క్రిస్తియన్ మైనారిటి సమాఖ్య చేసిన ప్రకటన అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇక్కడ జమాత్ ప్రకటన కాస్త విచిత్రంగానే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ కు మెజారిటి మద్దతు ఇస్తున్నట్లు మాత్రమే ప్రకటించింది. తాము టీఆర్ఎస్ కు కూడా నియోజకవర్గాల వారీగా మద్దతు ఇస్తామని ప్రకటించడం వింత.
అంటే ముస్లిం మైనారిటీలంతా గుండుగుత్తగా కాంగ్రెస్ కే మద్దతని ప్రకటించలేదు. ప్రకటనలోని సారాంశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేస్తున్న 69 మంది అభ్యర్ధులకు మద్దతుగా ముస్లింలు ఓట్లేస్తారట. బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న 41 మందికి సహకారం అందిస్తామని ప్రకటించింది. ఎంఐఎం తరపున పోటీచేస్తున్న ఏడుగురు అభ్యర్ధులకూ, సీపీఐ, బీఎస్పీ అభ్యర్ధులకు కూడా మద్దతుగా ఓట్లేస్తామని ప్రకటించటమే కాస్త ఆశ్చర్యంగా ఉంది. అంటే ముస్లిం మైనారిటిల్లోని ఓట్లను పార్టీల మధ్య తలా కొన్నిచొప్పున జమాత్ పంచబోతున్నట్లు అర్ధమవుతోంది.
మామూలుగా అయితే ఇలా ఎక్కడా జరగదు. వేస్తే ఏదో ఒక పార్టీకి మద్దతుగా నిలబడుతుంది. లేకపోతే అసలు ఏ పార్టీకి మద్దతుగా ఉండదు. అప్పుడు ఎవరిష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు ఓట్లేసుకుంటారంతే. అంతేకానీ ఉన్న వంద ఓట్లలో తలా కొన్ని వేయిస్తామని చేసిన ప్రకటనే విచిత్రంగా ఉంది. ఇప్పటివరకు ముస్లింల ఓట్లన్నీ తమకే పడతాయని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చాలా బలంగా నమ్ముతున్నారు.
ఎందుకంటే గడచిన రెండు ఎన్నికల్లో ముస్లింల ఓట్లు బీఆర్ఎస్ కే పడ్డాయి. అందులోను ఎంఐఎం పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో మినహా మిగిలిన నియోజకవర్గాల్లోని ముస్లింలందరు బీఆర్ఎస్ కే ఓట్లు వేయాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ పదేపదే చెబుతున్నారు. తాజాగా జమాత్ చేసిన ప్రకటన చూసిన తర్వాత అసదుద్దీన్ మాట కూడా ముస్లింలందరిలో చెల్లుబాటు అయ్యేట్లుగా లేదని అర్ధమవుతోంది. అసద్ మాటే చెల్లుబాటు కాకపోతే ఇక కేసీయార్ అండ్ కో నమ్మకం ఎక్కడ చెల్లుబాటవుతుంది ? మరి చివరకు జమాత్ ప్రకటన ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.