జ‌న‌సేన స‌భ్య‌త్వాలు స‌రే.. ఆ పార్టీకి అస‌లు ప్రాబ్ల‌మ్ ఇదే..?

రాష్ట్రంలో జనసేన పార్టీ కొన్ని రోజుల కిందట ప్రారంభించిన సభ్యత్వాల నమోదు కార్యక్రమం భారీ ఎత్తున సాగింది

Update: 2024-08-06 04:13 GMT

రాష్ట్రంలో జనసేన పార్టీ కొన్ని రోజుల కిందట ప్రారంభించిన సభ్యత్వాల నమోదు కార్యక్రమం భారీ ఎత్తున సాగింది. సుమారు 15 రోజులు పాటు నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారంతో ముగిసింది. ఇప్పటివరకు సుమారు 13 లక్షల మంది రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వాలు నమోదు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ముందుగా వేసుకున్న అంచనా ప్రకారం చూస్తే ఐదు లక్షలకు మించకపోవచ్చు అని అందరూ భావించారు. పార్టీ కూడా ఇదే భావించింది. ఐదు నుంచి ఏడు లక్షల మధ్య సభ్యత్వాలు ఉంటే సరిపోతుందని అనుకున్నారు.

కానీ ఊహించని విధంగా ప్రజల నుంచి స్పందన లభించింది. జనసేన సభ్యత్వాలు తీసుకునేందుకు వృద్ధుల నుంచి యువకుల వరకు ప్రజలు పోటెత్తి మరి పార్టీలో చేరారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అసలు సమస్య ఏంటంటే సభ్యత్వాలు ఉండడం ఎంత ముఖ్యమో పార్టీకి కార్యకర్తలు కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం నమోదు చేసిన సభ్యత్వాలను గమనిస్తే 40 నుంచి 50 ఏళ్ల మధ్యలోనే ఎక్కువ మంది సభ్యత్వాలు తీసుకున్నారు. దీనికి కారణం సభ్యత్వ నమోదు కారణంగా ఇస్తున్న `ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలు` తమకు మేలు చేస్తుందని ఎక్కువ మంది భావిస్తున్నారు.

అందుకే సభ్యత్వాల నమోదు ఎక్కువగా క‌నిపిస్తోంది. పార్టీ నాయకులు అంతర్గతంగా చెబుతున్న మాట కూడా ఇదే. పైగా వీరంతా రేపు జండాలు పట్టుకోవడానికి జేజేలు కొట్టడానికి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కేవలం పవన వస్తే మాత్రమే వచ్చే యువత వేరు. ఇతర నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వారికి అండగా ఉండే కార్యకర్తలు వేరుగా ఉంటారు. ఈ కార్యకర్తలను పెంచుకోవలసిన అవసరం జనసేనకు ఉంది. కానీ, కార్యకర్తల విషయాన్ని పక్కనపెట్టి సభ్యత్వాలు నమోదుకు మాత్రమే పరిమితమైంది.

ఉదాహరణకు ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకుంటే రాష్ట్రంలో ఆ పార్టీకి రెండు లక్షల మంది సభ్యత్వాలు ఉన్నాయి. కానీ ఎక్కడా జెండా కనిపించ‌దు. ఎక్కడా జేజేలు వినిపించవు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినప్పుడు కూడా ఏపీలో ఎవరు గళం విప్పలేదు. దీనికి కారణం కేవలం సభ్యత్వాలు తీసుకున్నటువంటి వారి వయస్సు 40 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండడమే. వీరికి పార్టీ అంటే ఒక వైట్ కలర్ పార్టీ అన్నట్టుగా భావించడం, అదేవిధంగా పార్టీలో ఉంటే మేధావులుగా గుర్తిస్తారు అనే ఒక ప్రచారం ఉండటం వంటివి.

అయితే, కార్యకర్తలను పెంచుకునేందుకు మాత్రం ఇలాంటి సభ్యత్వాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనేది 2019 ఎన్నికల్లో 2024 ఎన్నికల్లోను ఆమ్ ఆద్మీ పార్టీకి స్పష్టంగా తెలిసింది. మరి ఇలాంటి సభ్యత్వాల్ని జనసేన ముందుకు తీసుకు వెళ్తుందా కార్యకర్తలను పట్టించుకోవడం లేదా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు చూపిస్తారు? ఎలా చూపిస్తారు? అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News