బీజేపీ ఎంట్రీతో జనసేన సీట్లకు కోత...!?
ఒక వేళ బీజేపీ పొత్తు కలవకపోతే జనసేనకు మరిన్ని సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు అని ప్రచారం సాగింది.
టీడీపీ జనసేన కూటమిలో సీట్ల పంచాయతీ అలా ఉండగానే ఇపుడు మూడవ పార్టీగా బీజేపీ వచ్చేస్తోంది. బీజేపీ బెట్టు చేసి మరీ ఎంట్రీ ఇస్తోంది. దాంతో సీట్ల సర్దుబాటు మరింత జఠిలంగా మారుతోంది. జనసేనకు అయినా బీజేపీకి అయినా పెద్ద పార్టీగా టీడీపీయే సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక చూసుకుంటే కనుక టీడీపీ అనుకూల మీడియా రాసినట్లుగా జనసేనకు పాతిక నుంచి ముప్పయి సీట్ల దాకా అసెంబ్లీకి టీడీపీ ఇవ్వవచ్చు అని ఇప్పటిదాకా వినిపించిన మాట.
అయితే అవి చాలా తక్కువ అని జనసేనలో వారితోపాటు బలమైన కాపు సామాజిక వర్గం నేతలు కూడా ఆందోళన చెంతున్నారు. దాంతో ఎలాగైనా 35 నుంచి 40 సీట్ల దాకా సీట్లు సాధించాలని అదే మధ్యేమార్గం అని పవన్ భావిస్తున్నారు. ఈలోగా బీజేపీ కూడా పెద్ద డిమాండ్ నే ముందు పెట్టింది.
ఆ పార్టీ ఏకంగా పాతిక సీట్లను కోరుతోంది. దానిలో నుంచి 15 సీట్ల దాకా అయినా టీడీపీ ఇవ్వాల్సిన అనివార్యత ఉంది. ఈ నేపధ్యంలో జనసేనకు పాతిక కంటే ఎక్కువ సీట్లు దక్కుతాయా అన్నది మరో చర్చగా ఉంది. జనసేనకు కోరినట్లుగా 35 నుంచి 40 సీట్ల దాకా ఇస్తే ఇక 33 శాతం సీట్లు ఇక్కడే పోతాయని టీడీపీలో ఆందోళన మొదలైంది
అందుకే బీజేపీ రాకతో జనసేన సీట్లకే కోత పడుతోంది అని అంటున్నారు. ఒక వేళ బీజేపీ పొత్తు కలవకపోతే జనసేనకు మరిన్ని సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు అని ప్రచారం సాగింది. ఇపుడు జనసేనకు సీట్ల చికాకు తప్పడంలేదు అని అంటున్నారు. అంతే కాదు ఆ పార్టీ కోరుకున్న సీట్లు కూడా దక్కుతాయా లేదా అన్నది మరో టెన్షన్ గా ఉందని అంటున్నారు.
ఎందుకంటే చాలా చోట్ల బీజేపీ జనసేన ఆశిస్తున్న సీట్లు ఒక్కటే కావడంతో ఆ పంచాయతీ కూడా ఉండబోతోంది అని అంటున్నారు. ఇపుడు జనసేనకు కాపు సామాజికవర్గం నుంచి మరో తలనొప్పి కూడా ఎదురుకాబోతోంది అని అంటున్నారు. అదేంటి అంటే కేవలం అర సున్నా శాతం ఓట్లతో బీజేపీ 15 దాకా సీట్లు ఆరేడు దాకా ఎంపీ సీట్లు పొత్తులో రాబట్టుకుంటే ఆరు శాతం నుంచి పన్నెడు శాతం దాకా ఓటు బ్యాంక్ ని పెంచుకున్న జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుందో చెప్పాలని కాపు నేతల నుంచి డిమాండ్ వస్తోంది.
ఈ నిష్పత్తి చూసుకుంటే కనుక ఈజీగా జనసేనకు యాభైకి పైగా సీట్లు ఇవ్వాల్సిందే అలా పవన్ కళ్యాణ్ పట్టుబట్టాలని కూడా కోరుతున్నారుట. మొత్తానికి బీజేపీతో పొత్తు వల్ల ఏమి మేలు జరుగుతుందో ఎవరికీ తెలియడంలేదు కానీ ముందు సీట్ల దగ్గర నుంచి అన్నీ తలకాయ నొప్పులే అని అంటున్నారు. రాజకీయ యోధుడు అయిన చంద్రబాబు సైతం ఈ పొత్తు చిక్కు ముడులను విప్పగలరా అని కూడా అంటున్నారు.