జనసేన డెసిషన్ బీజేపీ కొంప ముంచబోతుందా...?

ఈ మేరకు పవన్ కళ్యాణ్ తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ జి కిషన్ రెడ్డితో కలసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళారు. అక్కడ అమిత్ షాతో నలభై నిముషాల పాటు భేటీ అయి తిరిగి వచ్చారు.

Update: 2023-11-01 13:19 GMT

తెలుగుదేశం పార్టీ బాటలో జనసేన నడవనుందా. ప్రస్తుతం జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే అదే అయ్యేలా అనిపిస్తోంది అని అంటున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు ఉంది. అదే విధంగా తెలంగాణాలో బీజేపీతో కలసి ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ జి కిషన్ రెడ్డితో కలసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళారు. అక్కడ అమిత్ షాతో నలభై నిముషాల పాటు భేటీ అయి తిరిగి వచ్చారు.

కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కలసి పొత్తుల సంగతి తేల్చుకోమని అమిత్ షా సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే పవన్ ఈ మధ్యలో విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చాక పొత్తు లెక్కలు ఒక కొలిక్కి వస్తాయని బీజేపీ భావిస్తోంది.

మరో వైపు చూస్తే జనసేనకు బీజేపీ ఆరు నుంచి తొమ్మిది స్థానాలను ఇవ్వడానికి చూస్తోంది అని ప్రచారం సాగుతోంది. బీజేపీ ఇంకా 66 కి పైగా సీట్లను ప్రకటించాల్సి ఉంది. అందులో జనసేనకు ఈ సీట్లు వదిలిపెట్టాలని సంఖ్యాపరంగా ఆలోచిస్తోంది అని అంటున్నారు.

ఇక ఏ ఏ స్థానాలలో పోటీ చేయించాలన్నది బీజేపీ జనసేన కలసి ఆలోచించాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ తిరిగి వచ్చాక ఈ లెక్కలు పోటీ చేసే స్థానాలు ఒక కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు. అయితే జనసేన బీజేపీ ఇచ్చే సింగిల్ డిజిట్ నంబర్ తీసుకుని పోటీ చేస్తుందా అన్నదే చర్చకు వస్తోంది.

పైగా ఆయా చోట్ల గెలుపు అవకాశాలు ఎంత మేరకు ఉంటాయన్నది మరో చర్చ. అదే విధంగా చూస్తే ప్రచారానికి సమయం ఎక్కువగా లేదు. జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అంగబలం అర్ధబలం కలిగి ఉన్న అభ్యర్ధులు ఉన్నారా అన్నది మరో ప్రశ్నగా ఉంది. ఇక జనసేన తరఫున పవన్ కళ్యాణ్ వారాహి వాహనం ఎక్కి ప్రచారం చేయాల్సి ఉంది.

ఆయన కేవలం జనసేనకే ప్రచారం చేస్తే సరిపోదు, బీజేపీకి కూడా చేయాలి. పొత్తు కుదుర్చుకున్నదే బీజేపీ అందుకు అంటున్నారు. బీజేపీ తెలంగాణా నాయకులు అటు కాంగ్రెస్ ని ఇటు బీయారెస్ ని గట్టిగానే విమర్శిస్తున్నారు పవన్ సైతం అదే దూకుడుని ప్రదర్శించాల్సి ఉంటుంది.

తీరా ఇంత కష్టపడినా రేపటి రోజున గెలిచేవి ఆ రెండు పార్టీలలో ఏదో ఒకటి అని సర్వేలు చెబుతున్నాయి. అలా డైరెక్ట్ గా ఆ రెండు పార్టీలతో వైరం పెట్టుకోవాల్సి రావడం జనసేనకు అనివార్యంగా కనిపిస్తోంది. అలాగే బీజేపీతో పొత్తు తెలంగాణాలో పెట్టుకుని ఏపీతో టీడీపీ సాగడం కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఏపీ విషయం బీజేపీ తేల్చడంలేదు అని అంటున్నారు.

ఇవన్నీ చూస్తూంటే జనసేన సింగిల్ డిజిట్ నంబర్ తో ఎన్నికల్లో పోటీ చేయడం అవసరమా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయట. తెలుగుదేశం తరహాలోనే పోటీ నుంచి విరమించుకుంటే సేఫ్ జోన్ లో ఉన్నట్లు అవుతుంది అని అంటున్నారు. ఇక జనసేన బీజేపీ కలిస్తే ఓట్ల చీలిక వల్ల అధికార పక్షానికి లాభం జరుగుతుంది అన్న అంచనాలు ఉన్నాయి.

అలా జరగకూడదనే తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి విరమించుకుంది అన్న మాటా ఉంది. తెలుగుదేశంతో పొత్తు జనసేనకు ముఖ్యం, అలాగే ఏపీ రాజకీయాలు ముఖ్యం అని అంటున్నారు. ఇక టీడీపీ బీజేపీ మధ్య రిలేషన్స్ రేపటి రోజున ఏ రూపు తీసుకుంటాయో అన్న సందేహాలు ఉన్నాయి. దాంతో మూసి ఉన్న చేతులను బయటపెట్టి కమిట్ అయిపోవడం అవసరమా అన్న చర్చ అయితే జనసేనలో వస్తోందిట.

అన్ని విధాలుగా ఆలోచిస్తే పోటీ నుంచి తప్పుకుంటే బెటర్ అన్నదే జనసేన హితైషులు అధినాయకత్వానికి సూచిస్తున్నారుట. ఇక్కడ టీడీపీ మనసెరిగి నడచుకోవాలని కూడా ఆలోచిస్తున్నారుట. ఏది ఏమైనా జనసేన తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్నది పవన్ విదేశీ పర్యటన నుంచి వచ్చాక తేలుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News