బాబు నేషనల్.. లోకేశ్ లోకల్.. : జేసీ సంచలన వ్యాఖ్యలు
తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్లిపోతారంటూ జేసీ అభిప్రాయపడ్డారు.
ఏపీకి నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఐదేళ్లు పదవిలో కొనసాగరా? ఆయన స్థానంలో మరొకరు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే కచ్చితంగా అదే జరుగుతుందని అంటున్నారు టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి. వయసు, ఆరోగ్యం రీత్యా గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి జేసీ.. అప్పుడప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు. తన రాజకీయ అనుభవంతో రాష్ట్ర రాజకీయాలపై అంచనాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్లిపోతారంటూ జేసీ అభిప్రాయపడ్డారు.
జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం టీడీపీలో క్రియాశీలంగా పనిచేస్తోంది. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మనుగా ఉండగా, ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే. ఇక వీరి మేనల్లుడు దీపక్ రెడ్డి సీడాప్ చైర్మనుగా వ్యవహరిస్తున్నారు. దివాకర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లోనే సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీ హయాంలో సుదీర్ఘకాలం మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన జేసీ కుటుంబం.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉన్నారు దివాకర్ రెడ్డి. కానీ, అప్పుడప్పుడు మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలపై తన విశ్లేషణలు వినిపిస్తుంటారు.
తాజాగా తన అనుభవంతో చెబుతున్నానని, త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు చోటుచేసుకోబోందని విశ్లేషించారు జేసీ దివాకర్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానంలో ఆయన కుమారుడు లోకేశ్ సీఎం అవుతారని దివాకర్ రెడ్డి అంచనా వేశారు. తాను ఇలా చెబుతున్నది చంద్రబాబు బలవంతంగా వైదొలగమని కాదని, ఆయన అనుభవం జాతీయ రాజకీయాలకు అవసరమని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు జాతీయ రాజకీయాలు నడిపే సామర్థ్యం, నైపుణ్యం ఉన్నాయని జేసీ చెప్పారు. అయితే వచ్చే ఎన్నికలకు ముందు ఈ మార్పు జరగొచ్చని తాను అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యానించేందుకు జేసీ నిరాకరించారు. తనకు పవన్ కల్యాణ్ తో అంతగా వ్యక్తిగత సంబంధాలు లేవని, ఆయన రాజకీయ భవిష్యత్ కోసం తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని చెప్పారు. కాగా, ఇటీవల ఏపీలో డిప్యూటీ సీఎం విషయమై టీడీపీ, జనసేన మధ్య పెద్ద దుమారమే లేచింది. ఈ విషయంపై ఎవరూ మాట్లాడొద్దని రెండు పార్టీలు కార్యకర్తలకు సూచించగా, మంత్రి టీజీ భరత్ కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ అంటూ వ్యాఖ్యానించి చంద్రబాబుతో చీవాట్లు తిన్నారు. ఇప్పుడు సీనియర్ నేత దివాకర్ రెడ్డి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. తన సమకాలీకుడైన జీసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.