వారసుడి గెలుపు కోసం 'జేసీ' అలా చేశారా? అదే ఘర్షణలకు కారణమా?
ఇక, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా కొన్ని రోజులు స్థానికంగా ఉండద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత..హింస చెలరేగిన నియోజకవర్గాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ఒకటి. ఇక్కడ చెలరేగిన హింస.. ఏకంగా కుటుంబాలకు కుటుంబాలనే ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లేలా.. కీలక నాయకులు అజ్ఞాతం బాట పట్టేలా చేసింది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి కుటుంబాలను స్తానికంగా లేకుండా .. హైదరాబాద్ కు పోలీసులు తరలించేశారు.ఇక, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా కొన్ని రోజులు స్థానికంగా ఉండద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.
వాస్తవానికి తాడిపత్రి నియోజకవర్గం ఆది నుంచి కూడా అంటే.. దాదాపు 40 ఏళ్లపాటు జేసీ(జున్నూరు చంటి) బ్రదర్స్ ఆధిపత్యం లోనే ఉంది. సుదీర్ఘంగా ఇక్కడ నుంచి జేసీ దివాకర్ రెడ్డి విజయం దక్కించుకున్నారు. తర్వాత 2014లో జేసీ ప్రభాకర్ కూడా ఎమ్మెల్యే అయ్యారు. అయితే.. ఇలాంటి ఆధిపత్యానికి వైసీపీ నాయకుడు.. ఒకప్పటి జేసీల మిత్రుడు, కాంగ్రెస్ మాజీ నేత కేతిరెడ్డి పెద్దా రెడ్డి బ్రేకులు వేశారు. ఈ క్రమంలోనే ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఇక్కడ విజయం దక్కించుకున్నారు. ఆ సమయంలో జేసీ వర్గంగా ఉన్నవారిని తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు.
అక్కడితో కూడా... పెద్దారెడ్డి ఆగలేదు. గడిచిన ఐదేళ్ల కాలంలో జేసీల ఆర్థిక మూలాలు, నాయకత్వ మూలాలపైనా దెబ్బకొట్టడం ప్రారంభించారని టీడీపీ నేతలు చెబుతుంటారు. ఒకానొక దశలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా జైలుకు పంపించారు. ఈ అస్తిత్వాన్నికాపాడుకునే క్రమంలో జేసీ బ్రదర్స్ నిరంతరం.. పోలీసులపైనా.. వైసీపీ నాయకులపైనా రాజకీయంగా పోరాటాలు చేయాల్సి వచ్చిందని ఈ వర్గం చెబుతోంది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల పోలింగ్‌లో జేసీ ప్రభాకర్ రెడ్డి వారసుడు.. జేసీ అస్మిత్ రెడ్డి వరుసగా రెండో సారి పోటీ చేశారు.
గత ప్రాభవాన్ని కాపాడుకునేందుకు, జేసీల రాజకీయాన్ని నిలబెట్టుకునేందుకు ఈ కుటుంబం వ్యూహాత్మకంగా వ్యవహరించిం ది. ఏకంగా పెద్దారెడ్డి అనుకూల పల్లెల్లోనే ప్రచారం చేయడం.. మహిళలను ఆకట్టుకోవడం.. వంటివి ఎన్నికలకు ముందుచర్చగా మారాయి. అంతేకాకుండా.. పెద్దారెడ్డి అనుచర వర్గంలోనూ చీలిక తెచ్చారని.. జేసీ బ్రదర్స్‌పై వాదన వినిపిస్తోంది. ఈ పరిణామా లను పోలింగ్ నాడు గమనించడంతోనే.. పెద్దారెడ్డి రాజకీయంగా ఈ కుటుంబంపై మరింత రెచ్చిపోయారనేది స్థానికంగా జరుగుతున్న చర్చ.
తొలుత పెద్దారెడ్డి అనుచరులతో ప్రారంభమైన వాదన, వివాదం.. చివరకు ఇళ్లపై దాడులు చేసుకునే వరకు కూడా వెళ్లింది. ఇక, తనకున్న పలుకుబడితో.. పెద్దారెడ్డి ఓ పోలీసు అధికారిని వినియోగించి.. జేసీ వర్గాన్ని భయభ్రాంతులకు గురి చేశారని.. ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారని అంటున్నారు. తాజాగా పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. ప్రతి విషయాన్నీ కూలంకషంగా తెలుసుకుంటున్నారు. పెద్దారెడ్డి సొంత గ్రామంలోనూ పర్యటించారు. ఇక్కడి మహిళలను విచారించారు. ఈ నేపథ్యంలోనే ఆయా వివాదానికి ఎక్కడ బీజం పడిందనే విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం తాడిపత్రి ప్రశాంతంగా ఉంది. కానీ, ఎప్పుడైనా ఇక్కడ పరిస్థితి మళ్లీ మామూలుగా మారుతుందనే బెంగ కూడా వెంటాడుతోంది.