జీవన్‌ రెడ్డి తీవ్ర మనస్తాపం... అదేనా అంతిమ నిర్ణయం?

వరుసపెట్టి బీఆరెస్స్ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్న సమయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-06-24 10:51 GMT

వరుసపెట్టి బీఆరెస్స్ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్న సమయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సమయంలో జీవన్ రెడ్డి స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా దీన్ని పచ్చి అవకాశవాదంగా అభివర్ణించారు. ఇలాంటివి తానసలు ప్రోత్సహించనని స్పష్టం చేశారు. ఏ పార్టీ అయినా సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.

కట్ చేస్తే... గత ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డిపై పోటీ చేసి గెలిచిన బీఆరెస్స్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్.. సంజయ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దింతో ఈ చేరిక ఆ పార్టీలో పెద్ద చిచ్చే రేపింది. ఇందులో భాగంగా.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో జీవన్ రెడ్డి ఉన్నారని అంటున్నారు.

అవును... తనపై పక్క పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన అభ్యర్థిని పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర మనస్థాపం చెందారని అంటున్నారు. సంజయ్ ను పార్టీలో చేర్చుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ఆయన అనుచరుల వద్ద ప్రశ్నించుకున్నట్లు తెలుస్తుంది. దీన్నే ఆయన పొమ్మనలేక పొగబెట్టడంగా భావిస్తున్నారని అంటున్నారని సమాచారం!

ఈ నేపథ్యంలో తన అనుచరులు, పార్టీ శ్రేణులతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. తనకు ఏమాత్రం సమాచారం లేకుండా జగిత్యాల బీఆరెస్స్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై తీవ్ర మనస్థాపం చెందినట్లు తెలుస్తుంది. దీంతో.. అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాజీనామా అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది.

కాగా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో గత మూడు పర్యాయాలూ సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. గత 2023 ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో జీవన్ రెడ్డి 15,822 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో తనకు ఏమాత్రం సమాచారం లేకుండా సంజయ్ ను కాంగ్రెస్ లో చేర్చుకొవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు!

మరోపక్క జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం పెద్దలకు తెలియడంతో బుజ్జగించే పనికి పూనుకున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆ పనిలో ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన శ్రీనివాస్... ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని కోరినట్లు తెలుస్తుంది. మరి జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి!

Tags:    

Similar News