ఆ ఇద్దరూ ఇద్దరే.. అందుకే వద్దు!
ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అమెరికా అగ్ర రాజ్యం కావడంతో ఈ ఎన్నికలు సర్వత్రా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా తలపడుతున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు.
కాగా అమెరికన్లు అటు జో బైడెన్, ఇటు డోనాల్డ్ ట్రంప్ ఇద్దరి పరిపాలనను ఇప్పటికే చూడటంతో వీరిద్దరిపై పెదవి విరుస్తున్నారని తెలుస్తోంది. ఇద్దరూ వద్దని కొత్తవారు అమెరికా అధ్యక్ష పదవిని చేపడితే బాగుంటుందని భావిస్తున్నారు.
ముఖ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురవుతోంది. డెమోక్రటిక్ పార్టీకే చెందిన పలువురు ఎంపీలు, నేతలు జో బైడెన్ వద్దని అంటున్నారు. ఆయన అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పించుకుని ఆ అవకాశాన్ని వేరే వారికి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ వినిపిస్తున్నారు.
ముఖ్యంగా జో బైడెన్ కు గట్టి మద్దతుదారుగా ఉన్న ప్రముఖ దర్శకుడు, నటుడు జార్జ్ క్లూనీ కూడా ఆయనను వ్యతిరేకిస్తున్నారు. జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే అమెరికా పార్లమెంటులోని రెండు సభలయిన ప్రతినిధుల సభ, సెనేట్ లో డెమోక్రాట్లు మద్దతు కోల్పోతారని బాంబుపేల్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని కోరుతున్నారు.
మరోవైపు జో బైడెన్ కు వయసు ప్రతిబంధకంగా మారింది. ప్రస్తుతం ఆయన వయసు 81 ఏళ్లు. దీంతో ఆయన అంత చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు. ఆయన వివి«ద సమావేశాల్లో, కార్యక్రమాల్లో ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. బైడెన్ వృద్ధ్యాప్య సమస్యలతో బాధపడుతున్నారని అంటున్నారు.
డోనాల్డ్ ట్రంప్ తో పోలిస్తే బైడెన్ పైనే వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. 2020లో జరిగిన ఎన్నికల్లో భారత సంతతి ప్రజల్లో 65 శాతం మంది జో బైడెన్ కు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు వీరిలో 19 శాతం కోతపడిందని తాజా సర్వే ఒకటి తేల్చింది.
అలాగే ట్రంప్ కు గత ఎన్నికల్లో భారత సంతతి ప్రజల్లో 28 శాతం మంది మద్దతు ఇచ్చారు. ఈసారి వీరి సంఖ్య 30 శాతం ఉందని సర్వేలు పేర్కొంటున్నాయి.
అమెరికాను ప్రగతిపథంలో నడిపేవారు కావాలని.. అనారోగ్య సమస్యలతో ఉన్నవారు కాదని సగటు అమెరికన్లు కోరుకుంటున్నారు. డోనాల్డ్ ట్రంప్ కూడా వృద్ధుడే. ఆయన వయసు 78 ఏళ్లు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో అటు 81 ఏళ్ల బైడెన్, 78 ఏళ్ల ట్రంప్ ఇద్దరూ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి,
ఈ ఇద్దరు అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా చాలామంది ఓటింగ్ కు కూడా దూరంగా ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. భారత సంతతి, ఆఫ్రో అమెరికన్ ప్రజల్లో ట్రంప్ తో పోలిస్తే బైడెన్ కే మద్దతు ఉన్నా.. ధరల పెరుగుదలపైన వారంతా ఆందోళన చెందుతున్నారని సమాచారం.
ట్రంప్ అధికారంలోకి వస్తే అమెరికాకు వలస వచ్చినవారి విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తారనే భయాలు భారత సంతతి, ఆఫ్రో అమెరికన్ ప్రజల్లో ఉన్నాయి. అయితే ఇప్పటివరకు వెలువడిన సర్వేల్లో బైడెన్ తో పోలిస్తే ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్ గెలిస్తే కష్టమేనని భావిస్తున్నవారు మాత్రమే బైడెన్ కు ఓటేస్తామంటున్నారు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ఈ నిర్ణయానికి వచ్చామంటున్నారు.
అయితే బైడెన్ తాను తప్పుకోబోనని.. తన మీద సంపన్నులు కుట్ర చేస్తున్నారని మండిపడుతున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసి తీరతానని చెబుతున్నారు.