జేపీసీ అంటే ఏమిటి?... గతంలో ఏయే సందర్భాల్లో దీన్ని ఏర్పాటుచేశారు?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు సంబంధించిన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన బిల్లు తాజాగా పార్లమెంట్ ముందుకొచ్చింది

Update: 2024-12-17 11:20 GMT

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు సంబంధించిన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన బిల్లు తాజాగా పార్లమెంట్ ముందుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్ వాల్ దీనికి సంబంధించిన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీనికి కాంగ్రెస్, మిత్రపక్షాలు వ్యతిరేకించగా.. బీజేపీ, దాని మిత్రపక్షాలు మద్దతు ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో... ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపే విషయంపై విపక్షాలు డివిజన్ ను కోరాయి. దీంతో... జేపీసీకి పంపడానికి ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ ను స్పీకర్ ఓబిర్లా నిర్వహించారు. ఈ నేపథ్యంలో... 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా.. 198 మంది వ్యతిరేకించారు. ఈ సందర్భంగా అసలు ‘జేపీసీ’ అంటే ఏమిటి.. గతంలో ఏయే సందర్భాల్లో దీన్ని ఏర్పాటు చేశారనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... ఏదైనా ఒక నిర్ధిష్టమైన బిల్లుకు లేదా ఏదైనా కుంభకోణానికి సంబంధించిన సమాచారంపై విశ్లేషణ చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటవుతుంది. అందుకు లోక్ సభ, రాజ్యసభ లలో ఏదైనా ఒక చోట జేపీసీపై తీర్మానం చేసి మరో సభ దాన్ని బలపరచాల్సి ఉంటుంది. ఇది ఒక విధానం.

కాగా... ఇంకో విధానంలో... లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ కలిసి సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయంతోనూనూ ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయవచ్చు. ఈ కమిటీలో రెండు సభలకు సంబంధించిన ఎంపీలు సభ్యులుగా ఉంటారు. ఎంపికైన లోక్ సభ సభ్యుల్లో సంగానికి సమానమైన సభ్యులను ఎగువ సభ నుంచి ఎన్నుకుంటారు.

అంటే... ఉదాహరణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో 10 మంది లోక్ సభ నుంచి సభ్యులు ఉంటే.. రాజ్యసభ నుంచి 5గురు ఎంపీలు ఉంటారు. అంటే.. మొత్తంగా ఈ కమిటీలో రెండు సభల నుంచి 15 మంది సభ్యులు ఉంటారన్నమాట.

ఎలాంటి అధికారాలు ఉంటాయి..?:

ఈ విధంగా ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ.. తమ దృష్టికి వచ్చిన సమస్యలపై వివరణాత్మక పరిశోధనలు నిర్వహించే బాధ్యత కలిగి ఉంటుంది. ఈ క్రమంలో... సంబంధిత నిపుణులు, సంఘాలు, ప్రజా ప్రతినిధులు, వ్యక్తులు, పార్టీల నుంచి ఆధారాలను, సమాచారాలను, అభిప్రాయాలను సేకరిస్తారు. వాటిని లోతుగా పరిశీలిస్తారు.

ఇదే సమయంలో... వీరు పత్రాలను సమీక్షించవచ్చు, అధికారులను ఇంటర్వ్యూలు చేయవచ్చు అని చెబుతారు. ఈ కమిటీ కార్యకలాపాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి. అయితే.. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నిర్ధిష్ట కాలపరిమితి అంటూ లేదు. కాకపోతే.. తమ విధి పూర్తయిన తర్వాత రద్దు చేయబడుతుంది.

ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే... ఈ కమిటీ సిఫార్సులు చేసినప్పటికీ.. తమ రిపోర్ట్ ఆధారంగ చర్య తీసుకోమని ప్రభుత్వాన్ని బలవంతం చేయలేదు! అంటే... జేపీసీ ఇచ్చిన నివేదిక, చేసిన సిఫార్సులను అనుసరించడం, అనుసరించకపోవడం అనేది పూర్తిగా ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.

కాకపోతే... కమిటీ సూచించిన సిఫార్సులు, ప్రభుత్వ ప్రతిస్పందనలు పార్లమెంటులో చర్చించబడతాయి.

ఇప్పటివరకూ జేపీసీలు ఏయే సందర్భాల్లో ఏర్పాటయ్యయంటే...?:

1987లో తొలిసారిగా బోఫోర్స్ కుంభకోణంపై జేపీసీని ఏర్పాటు చేశారు.

1992 లో హర్షద్ మెహతా కుంభకోణంపై రెండోసారి జేపీసీ ఏర్పాటైంది.

దీని తర్వాత 2001లో కేతన్ పరేఖ్ షేర్ మార్కెట్ కుంభకోణంపై జేపీసీని ఏర్పాటు చేశారు.

ఇక 2003లో కూల్ డ్రింక్స్ లో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని తేలడంతో జేపీసీని ఏర్పాటు చేశారు.

2011లో 2జీ స్పెక్ట్రం కుంభకోణానికి సంబంధించిన కేసు విచారణ కోసం జేపీసీ ఏర్పాటైంది.

ఆ తర్వాత.. అగస్టా వెస్ట్ లాండ్ నుంచి రక్షణశాఖ వీవీఐపీ హెలీకాప్టర్లను పొందడానికి జరిపిన లావాదేవీల్లో అవకతవకలపై 2013లో జేపీసీ ఏర్పాటైంది!

ఇక 2015లో భూసేకరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు చేయాలని సుచించగా... 2019లో వ్యక్తిగత సమాచారం, గోప్యతా పరిరక్షణ బిల్లుకు సంబంధించి జేపీసీ ఏర్పాటూ చేశారు.

Tags:    

Similar News