పది రోజుల్లో న్యాయం చేయాలి.. లేదంటే టీడీపీకి రాజీనామా!

1985 నుంచి 2009 వరకు వరుసగా ఆరుసార్లు అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి జేసీ దివాకర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Update: 2024-06-19 09:27 GMT

రాయలసీమలో.. ఆ మాటకొస్తే ఏపీలోనే జేసీ బ్రదర్స్‌ గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. సీనియర్‌ రాజకీయ నాయకుడిగా, విలక్షణ రాజకీయవేత్తగా జేసీ దివాకర్‌ రెడ్డికి పేరుంది. 1985 నుంచి 2009 వరకు వరుసగా ఆరుసార్లు అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి జేసీ దివాకర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇక 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనతో జేసీ దివాకర్‌ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌ రెడ్డి టీడీపీలో చేరారు. అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్‌ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఘనవిజయం సాధించారు.

అయితే 2019లో అన్నదమ్ములిద్దరూ తమ వారసులను బరిలో దించారు. తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డి, అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్‌ రెడ్డి కుమారుడు జేసీ పవన్‌ కుమార్‌ రెడ్డి పోటీ చేసి వైసీపీ గాలిలో ఓటమి పాలయ్యారు.

2024 ఎన్నికల్లో జేసీ కుటుంబం నుంచి ఒక్కరికే సీటు దక్కింది. జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డి తాడిపత్రి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక అనంతపురం ఎంపీ సీటు నుంచి బరిలోకి దిగాలని చూసిన జేసీ పవన్‌ కు చంద్రబాబు సీటు ఇవ్వలేదు. అనంతపురం నుంచి బీసీలను బరిలో దించడంతో పవన్‌ కు సీటు దక్కలేదు.

కాగా ప్రస్తుతం జేసీ ప్రభాకర్‌ రెడ్డి తాడిపత్రి మునిసిపాలిటీ చైర్మన్‌ గా ఉన్నారు. 2019లో వైసీపీ గెలిచాక జేసీ బ్రదర్స్‌ కు కష్టాలు మొదలయ్యాయి. జేసీ బ్రదర్స్‌ కు చెందిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులు అక్రమ రిజిస్ట్రేషన్లతో తిరుగుతున్నాయని, తుక్కు కింద ఇతర రాష్ట్రాల్లో వాహనాలను కొని వాటికి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించి ప్రజా రవాణా వాహనాలుగా తిప్పుతున్నారని కేసులు నమోదయ్యాయి.

ఎక్కే జైలు, దిగే జైలు అన్నట్టు జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఒక కేసులో జైలు నుంచి విడుదల కావడం.. మరో కేసులో అరెస్టు చేయడం షరా మామాలుగా మారింది. అధికారులపై దౌర్జన్యం చేశారని, కులం పేరుతో తిట్టారని ఇలా పలు కేసులు సైతం ప్రభాకర్‌ పై నమోదయ్యాయి. హత్యాయత్నం కేసులు, ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసులు కూడా ఆయనపై దాఖలయ్యాయి.

నిన్నమొన్నటి వరకు తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డితో జేసీ ప్రభాకర్‌ అలుపెరుగని పోరాటం చేశారు. 2019లో పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి జేసీ ప్రభాకర్, పెద్దారెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో హెచ్చరికలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. స్వయంగా జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇంటిపైకి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి Ðð ళ్లారు. ఈ ఘటన తీవ్ర ఉద్రికత్తలకు దారితీసింది.

ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జేసీ ప్రభాకర్‌ రెడ్డి తన దూకుడు పెంచారు. వైసీపీ ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో తాను, తన కుటుంబం భారీగా నష్టపోయామని జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమపై తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమ వాహనాలను ఆపేసి.. తమను వేధించిన రవాణా అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని జేసీ ప్రభాకర్‌ కోరారు. తనకు పది రోజుల్లోగా న్యాయం చేయాలన్నారు. లేదంటే కుటుంబంతో సహా నిరసన దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ క్రమంలో అవసరమైతే టీడీపీకి రాజీనామా చేయడానికైనా సిద్ధమని జేసీ ప్రభాకర్‌ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో తమను దొంగలంటూ జైలుకు పంపారని జేసీ ప్రభాకర్‌ రెడ్డి గుర్తు చేశారు. తన బస్సులపై తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్‌ 3 వాహనాలు అమ్మినవారు, రిజిస్ట్రేషన్లు చేసినవారు ఇంటికి పోయారన్నారు. పది రోజుల్లో తనకు న్యాయం జరగాలని కోరారు. లేదంటే తన కోడలు, కుమారుడు ఎస్పీ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తారని హెచ్చరించారు. అలాగే తాను, తన భార్య జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపడతామన్నారు.

ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వానికి సంబంధించింది కాదని జేసీ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. ఇది తన వ్యక్తిగత విషయమని.. తనకు న్యాయం జరగాలని కోరారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనుకుంటే టీడీపీకి రాజీనామా కూడా చేస్తానన్నారు.

Tags:    

Similar News