కదలిరా అంటే తరలి వస్తున్న జన సైన్యం...!

అయితే చంద్రబాబు సభలకు ఎక్కువగా జనసైనికులు కదలి రావడం విశేషంగా చూస్తున్నారు.

Update: 2024-01-30 03:39 GMT

తెలుగుదేశం పార్టీ సభలకు జనాల సందడి కనిపిస్తోంది. పొత్తులు జనసేన టీడీపీల మధ్య కుదిరాక రెండు పార్టీల జెండాలు ప్రతీ సభలో రెపరెపలాడుతున్నాయి. అయితే చంద్రబాబు సభలకు ఎక్కువగా జనసైనికులు కదలి రావడం విశేషంగా చూస్తున్నారు.

పొత్తు ధర్మాన్ని పాటించి వారంతా బాబుకు జై కొడుతున్నారు. రాజమండ్రిలో జరిగిన బాబు రా కదలిరా సభకు జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావడంతో చంద్రబాబు ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు. ఈ దూకుడు ఇలాగే కొనసాగాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఏపీలో వైసీపీని గద్దె దించేంతవరకూ ఈ ఉత్సహాం ఆగకూడదు అని ఆయన కోరారు.

రాజమండ్రి సభ సక్సెస్ అయింది. ఎంతలా అంటే వేదిక మీద అధినేత చంద్రబాబునే తోసివేసేటంతగా కిక్కిరిసిపోయారు నేతలు. దాంతో చంద్రబాబు సైతం ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. కేవలం రాజమండ్రి సభ మాత్రమే కాదు బాబు ఎక్కడ సభలు పెట్టినా జనసేన జెండాలే ముందు దర్శనం ఇస్తున్నాయి.

గ్రౌండ్ లెవెల్ లో రెండు పార్టీల క్యాడర్ మధ్య సంఖ్యత లేదు అన్న వారికి ఇదే జవాబు అని కూడా అంటున్నారు. ఇక్కడ మరో ముచ్చట కూడా చెబుతున్నారు. టీడీపీ కంటే కూడా జనసేన క్యాడర్ ఉత్సహాం ఎక్కువగా ఉంది అని వారు. నిబద్ధతతో బాబు సభలను విజయవంతం చేస్తున్నారు అని.

నిజానికి గోదావరి జిల్లాలలో జనసేన కార్యకర్తలు తమకు ఎక్కువ సీట్లు వస్తాయని ఆశ పెట్టుకున్నారు. వారు టీడీపీ జనసేన విజయం అని కూడా నినదిస్తున్నారు. అయితే టీడీపీ తమ్ముళ్ళు మాత్రం కొన్ని చోట్ల తమ సీట్లకు గండి పడుతోందని అలుగుతున్నారు. అలజడి సృష్టిస్తున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే రాజమండ్రి సభలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. జనసైనికుల ఉత్సాహాన్ని చూసి కూడా ఆయన ఈ సంగతి చెప్పి ఉంటారు అని అంటున్నారు ఇక మీదట సీట్లను ఎక్కడా ఎవరూ ప్రకటించరు. పొత్తు పార్టీలు రెండూ కూర్చుని చర్చించిన మీదటనే లిస్ట్ రిలీజ్ చేస్తామని బాబు ప్రకటించడం విశేషం. తానూ పవన్ కళ్యాణ్ ఇద్దరం కూర్చుని ఇరు పార్టీలూ పోటీ చేసే సీట్లను లిస్ట్ ప్రిపేర్ చేస్తామని అన్నారు.

మొత్తం మీద చూస్తే టీడీపీ జనసేన కూటమిలో ఉత్సాహానికి బాబు సభ నిదర్శనం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే సీట్ల విషయంలో చిక్కులు లేకుండా ఎవరికీ ఇబ్బంది లేకుండా సజావుగా చూడాల్సిన అవసరం అటు పవన్ మీద ఇటు చంద్రబాబు మీద ఉంది అని అంటున్నారు. లేకపోతే మాత్రం సీనియర్ నేత మాజీ మంత్రి హరి రామజోగయ్య చెప్పినట్లుగా ఓట్ల సర్దుబాటుకు ఇదే ప్రధాన అవరోధం అవుతుంది అని అంటున్నారు.


Tags:    

Similar News