'జగమొండిగా మర్చేశారూ... కవిత తీవ్ర భావోద్వేగం!
దీంతో... గులాబీ శ్రేణుల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై సుమారు ఐదున్నర నెలలుగా జైలు జీవితం అనుభవించిన బీఆరెస్స్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత.. తీహార్ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. దీంతో... గులాబీ శ్రేణుల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై సుమారు 160 రోజులుకు పైగా తీహార్ జైల్లో గడిపిన బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ పై విడుదలయ్యారు. ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. అనంతరం ఆమె హైదరాబాద్ కు బయలుదేరనున్నారు.
కవితతో పాటు కేటీఆర్, హరీష్ లు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుకోనున్నారని తెలుస్తోంది. అంతకంటే ముందు ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టనున్నారని సమాచారం. ఇక కవిత హైదరాబాద్ రాగానే ఘన స్వాగతం పలికేందుకు బీఆరెస్స్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాలీని నిర్వహించనున్నారని తెలుస్తోంది.
ఇక మంగళవారం బెయిల్ పై విడుదలైన సమయంలో కవిత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జైలు గేటు నుంచి బయటకు రాగానే కొడుకు, భర్త, అన్న కేటీఆర్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు! ఈ సమయంలో బీఆరెస్స్ నేతలు బాణసంచా కాల్చి, డప్పులు మోగిస్తూ ఘనస్వాగతం పలికారు.
ఈ సమయంలో మైకందుకున్న కవిత... కన్నీళ్లు పెడుతూనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తాను కేసీఆర్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదని అన్నారు. తన 18ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పూ చేయలేదని తెలిపారు. అన్నింటికంటే బాధ.. ఐదున్నర నెలలు కుటుంబానికి దూరం చేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే తాను చాలా మొండిని అని.. అయితే ఇప్పుడు తనను జగమొండిగా మార్చారని.. తనను ఇబ్బంది పెట్టినవారు వడ్డీతో సహా మ్యూల్యం చెల్లించుకోకతప్పదని కవిత ఘాటుగా హెచ్చరించారు. తనను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా తగ్గేదేలేదని కవిత పేర్కొన్నారు.
కాగా... ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత చాలా కాలంగా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రూ.10 లక్షల చొప్పున పూచీకత్తుపై ఎమ్మెల్సీ కవిత విడుదల అయ్యారు. ఈ సందర్భంగా పాస్ పోర్టు మెజిస్ట్రేట్ కు సబ్ మిట్ చేయాలని సూచించారు.