ఆ కూటమి గూటిలోకే కమల్ హాసన్!
కాగా ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులోని అధికార డీఎంకే సారథ్యంలోని కూటమిలో చేరాలని నిర్ణయించారు.
విలక్షణ నటుడు కమల్ హాసన్ ఓవైపు సినిమాలు. మరోవైపు రాజకీయాలు.. రెండింటిపైన స్వారీ చేస్తున్నారు. గతేడాది విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కమల్ ఇప్పుడు భారతీయులు –2 సినిమాతో బిజీగా ఉన్నారు. మరికొన్ని సినిమాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి.
కాగా తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమల్ హాసన్ రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. మక్కల్ నీది మయ్యమ్ పేరుతో ఈ పార్టీని ఏర్పాటు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ హాసన్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
కాగా ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులోని అధికార డీఎంకే సారథ్యంలోని కూటమిలో చేరాలని నిర్ణయించారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఉన్న సంగతి తెలిసిందే. వీటికి తోడు ఇప్పుడు కమల్ హాసన్ పార్టీ.. మక్కల్ నీది మయ్యమ్ కూడా డీఎంకేలో చేరింది.
కాగా పొత్తులో భాగంగా 2025 రాజ్యసభ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ కు ఒక సీటు కేటాయించనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కమల్ హాసన్ కానీ, ఆయన పార్టీ కానీ పోటీ చేయదు. డీఎంకే కూటమిలోని అభ్యర్థులకు మద్దతిస్తుంది. ఇందుకు ప్రతిగా 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఒక సీటును మక్కల్ నీది మయ్యమ్ కు కేటాయిస్తారు.
ఈ నేపథ్యంలో కమల్ హాసన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను కానీ, తన పార్టీ కానీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. అయితే డీఎంకే కూటమికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. డీఎంకే కూటమితో చేరడం పదవుల కోసం కాదని, దేశం కోసమని తెలిపారు. డీఎంకే కూటమి అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొంటామన్నారు.
కాగా మక్కల్ నీది మయ్యం పార్టీని కమల హాసన్ 2018 ఫిబ్రవరి 21న ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. అయితే ఒక్కసీటును కూడా గెలుచుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో కమల్ హాసన్ డీఎంకే కూటమిలో చేరాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటూ సాధించలేకపోయిన ఎంఎన్‌ఎం ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల నుంచి కూడా పూర్తిగా తప్పుకుంది.