బీఆర్‌ఎస్‌ కు గట్టి షాక్‌.. ఎంపీ పదవికి కీలక నేత రాజీనామా!

ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధనకడ్‌ కు అందజేశారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.

Update: 2024-07-04 11:00 GMT

తెలంగాణలో కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ కు గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ సెక్రటరీ జనరల్‌ కంచర్ల కేశవరావు (కేకే) తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధనకడ్‌ కు అందజేశారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.

కాగా ఇప్పటికే కేకే.. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

గతంలో కేకే కాంగ్రెస్‌ పార్టీ తరఫున పలు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మంత్రిగానూ ఉన్నారు. 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 2006–2012 వరకు కాంగ్రెస్‌ పార్టీ ఆయనను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసింది. పలు రాష్ట్రాలకు కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జిగా కేకే వ్యవహరించారు.

తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆలస్యం చేస్తుండటంతో 2013లో కేకే కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ లో చేరారు. ఆయనను కేసీఆర్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ గా నియమించారు. అంతేకాకుండా 2014లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. మళ్లీ తిరిగి 2020లో మరోసారి రాజ్యసభ సభ్యుడిగా తిరిగి ఎన్నికయ్యారు. దాదాపు ఇంకా రెండేళ్లు పదవీకాలం ఉన్నప్పటికీ కేకే తన పదవికి రాజీనామా చేశారు.

కాగా కేకే కుమార్తె విజయలక్ష్మి హైదరాబాద్‌ మేయర్‌ గా ఉన్నారు. ఆమె కూడా బీఆర్‌ఎస్‌ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కేకే కుమారుడు విప్లవ్‌ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ కు చైర్మన్‌ గా ఉన్నారు.

కాగా కేకే కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతగా ఉమ్మడి ఏపీలో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ పక్ష నేతగా కూడా ఉన్నారు. పార్టీలో కూడా కేసీఆర్, కేటీఆర్‌ తర్వాత ముఖ్య నేతగా ఆయనకు ప్రాధాన్యం దక్కింది.

గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో ఆ పార్టీ నేతలు చాలా మంది పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. మరికొందరు కూడా ఈ దారిలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఒకప్పటి కాంగ్రెస్‌ పార్టీ నేత కేకే కూడా బీఆర్‌ఎస్‌ కు రాజీనామా చేశారు. ఆ పార్టీ ద్వారా తనకు దక్కిన రాజ్యసభ సీటును కూడా వదులుకున్నారు.

Tags:    

Similar News