తుంగభద్రను కాపాడిన అద్భుత ఇంజినీర్... ఎవరీ కన్నయ్యనాయుడు?

అవును... తుంగభద్రను తాజాగా ఎదురైన ఇబ్బందిని పరిష్కరించడానికి రంగంలోకి దిగారు ఓ ఇంజినీర్.

Update: 2024-08-19 14:48 GMT

ఇటీవల కర్ణాటకాంధ్ర జీవనాడి తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ఉన్నట్టుండి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో... టీఎంసీల కొద్దీ నీళ్లు దిగువకు పోవడం మొదలైంది. ఈ సమయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఏపీలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ సమయంలో ఆ నీటికి అడ్డుకట్టవేయడంతో పాటు జలాశయం భద్రతను కాపాడే బాధ్యతను భుజానికెత్తుకున్నారు ఓ ఇంజినీర్.

 

అవును... తుంగభద్రను తాజాగా ఎదురైన ఇబ్బందిని పరిష్కరించడానికి రంగంలోకి దిగారు ఓ ఇంజినీర్. ఈ క్రమంలో వారం రోజుల్లో గేటుకు ప్రత్యామ్న్యాయంగా సాఫ్ట్ లాగ్ గేట్లను అమర్చడం ద్వారా సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపించారు. ఈ సందర్భంగా కర్ణాటక, ఏపీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, చంద్రబాబుల ప్రశంసలు అందుకున్నారు. ఆయనే 80 ఏళ్ల యువ ఇంజినీర్ కన్నయ్యనాయుడు.

 

ఎవరీ కన్నయ్యనాయుడు?:

దేశంలో ఎక్కడ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సమస్య తలెత్తినా గుర్తొచ్చే పేరు నాగినేని కన్నయ్యనాయుడు. తెలుగునాట పుట్టి, కన్నడనాట ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాలుపంచుకు.. నేడు తుంగభద్ర నాదీ తీరాన సేదతూరున్న రిటైర్డ్ ఇంజినీర్ ఈ కన్నయ్యనాయుడు. ఆయన చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రాసానపల్లెలో 1946లో ఓ రైతు కుటుంబంలో జన్మించారు.

ఈ క్రమలోనే తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం... తమిళనాడులోని సదరన్ స్ట్రక్చర్స్ కంపెనీలో ఐదేళ్లు పనిచేసిన ఆయన.. హోసపేటే సమీపంలోని తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ లో చేరారు. ఈ క్రమంలో డిజైన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ గా, సీనియర్ మేనేజర్ గా 2002 వరకూ సుమారు 26 ఏళ్లపాటు పనిచేశారు.

ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సుమారు 250 ప్రాజెక్టుల గేట్ల నిర్మణంలో పాల్గొన్నారు. ఇదే క్రమంలో... కర్ణాటక రాష్ట్రంలోని కీలకమైన నారాయణపూర్, ఆలమట్టి, భద్రా, సుఫా, హేమావతి డ్యామ్ లతోపాటు తుంగ బ్యారేజీ నిర్మాణంలోనూ ఆయన టెక్నికల్ గా సహాయ సహకారాలందించారు.

ఇక ఉమ్మడి ఏపీ విషయానికొస్తే.. నాగార్జున సాగరు, శ్రీశైలం, శొమశిల, జూరాల డ్యామ్ గేట్ల నిర్మాణంలోనూ, మరమ్మత్తులోనూ కన్నయ్యనాయుడి పాత్ర కీలకం. ఇదే క్రమంలో... ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం తగ్గించకుండానే గేటుకు మరమ్మత్తులు చేయించిన ఘనత ఆయన సొంతం. ఇదే క్రమంలో... మహారాష్ట్ర, గోవా, గుజరాత్, ఒడిశా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లలోనూ ప్రాజెక్టుల్లో సమస్యలకు పరిష్కారం చూపించారు.

ఈ క్రమంలో ప్రస్తుతం తుంగభద్ర నదీ తీరాన సేదతీరుతూ ఎనభై ఏళ్ల వయసులోనూ చెరగని చిరునవ్వుతో, తరగని ఉత్సాహంతో యువ ఇంజినీర్లకు మార్గదర్శనం చేస్తున్నారు ఈ అద్భుత ఇంజినీర్ కన్నయ్యనాయుడు.

Tags:    

Similar News