కర్ణాటక సీఎంలటేనే కేసులు.. సిద్దరామయ్య విచారణకు గవర్నర్ అనుమతి!
అదేంటోగాని.. కర్ణాటక ముఖ్యమంత్రుల చుట్టూ ఎప్పుడూ కోర్టు కేసులు ముసురుకుంటూ ఉంటాయి.
అదేంటోగాని.. కర్ణాటక ముఖ్యమంత్రుల చుట్టూ ఎప్పుడూ కోర్టు కేసులు ముసురుకుంటూ ఉంటాయి. నాటి ఎస్ఆర్ బొమ్మై నుంచి మొన్నటి యడియూరప్ప వరకు ఇదే తీరు. తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. 'ముడా' స్కామ్ ఆయన కొంపముంచేలా కనిపిస్తోంది. బీజేపీకి దక్షిణాదిన అధికారం దక్కిన తొలి రాష్ట్రం కర్ణాటక. అలాంటిచోట గత ఏడాది ఎన్నికల్లో సిద్ధరామయ్య-డీకే శివకుమార్ జోడీ కాంగ్రెస్ ను గెలిపించింది. ఎవరిని సీఎం చేయాలి? అనేది సమస్యగా మారిన సందర్భంలో అధిష్ఠానం చెరో రెండున్నరేళ్లు ప్రతిపాదనతో ముందుగా సీనియర్ అయిన సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టింది.
ఏమిటీ ముడా కేసు?
ముడా అంటే మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ. దీనికి సమీపంలోని కెసరె గ్రామంలో సిద్ధరామయ్య భార్య పార్వతికి మూడు ఎకరాల భూమి ఉంది. పుట్టింటి కానుకగా వచ్చిన ఈ భూమిని అభివృద్ధి పనుల్లో భాగంగా 'ముడా' తీసుకుంది. దీనికి పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను ఇచ్చింది. అయితే, కెసరెలోని భూమితో పోలిస్తే.. విజయనగరలోని భూమి మార్కెట్ ధర చాలా ఎక్కువని బీజేపీ ఆరోపణలు చేసింది. వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం హయాంలోనే ఈ కేటాయింపు జరిగింది. కానీ, దీనినో కుంభకోణంగా ఆరోపిస్తూ.. ఇందులో పార్వతి, మరికొందరి ప్రమేయం ఉందంటూ స్నేహమయి కృష్ణ అనే సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్ధు దంపతులు, కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ముడా భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో పార్వతి పాతర్ ఉందంటూ బీజేపీ కూడా ఫిర్యాదు చేసింది.
విచారణకు గవర్నర్ ఆదేశం
ముడా కేసులో సిద్దుకు గతంలో నోటీసులిచ్చన గవర్నర్ థవర్ చంద్ గెహ్లోత్ తాజా విచారణకు ఆదేశించారు. ఇది సిద్ధరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి తెచ్చేలా కనిపిస్తోంది. అయితే, ఇది బీజేపీ కుట్ర అని మొదటి నుంచి సిద్ధు ఆరోపిస్తున్నారు. కర్ణాటకపైనా ఆ పార్టీ కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. అసలు తమ భూమినే ముడా అక్రమంగా తీసుకుందని ఆరోపించారు తన భార్య పార్వతి పరిహారం పొందడానికి అర్హురాలని పేర్కొన్నారు. 2014లో తాను సీఎంగా ఉండగా పరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారని... తాను పదవిలో ఉన్నంతకాలం పరిహారం ఇవ్వలేదని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఉండగా 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే.. విజయనగరలో భూమిని కేటాయించారని స్పష్టం చేశారు. విజయనగర భూమి మార్కెట్ ధర ఎక్కువగా ఉందని బీజేపీ భావిస్తే.. వెనక్కి తీసుకొని తన భార్యకు న్యాయంగా చెందాల్సిన పరిహారాన్ని ఇవ్వాలని కోరారు.