ఆ రైతుకు వధువు కావలెను !
"నేను గత పదేళ్లుగా అమ్మాయి కోసం వెతుకుతున్నాను. అయితే నన్ను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు
"నేను గత పదేళ్లుగా అమ్మాయి కోసం వెతుకుతున్నాను. అయితే నన్ను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో నేను మానసికంగా క్షోభ అనుభవిస్తున్నాను. దయచేసి ఈ విషయంలో నాకు సహకరించగలరు. నాకు వధువును వెతికిపెట్టడానికి ఒక బ్రోకర్ ద్వారా సహాయం చేయండి" అని కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలో యువ రైతు సంగప్ప జిల్లా అధికారులకు దరఖాస్తు చేశాడు.
రైతుల సమస్యలు తెలుసుకునేందుకు అధికారులు స్థానికంగా ఒక సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సంగప్ప తనకు ఓ అమ్మాయిని వెతికి పెట్టాలని దరఖాస్తు చేశాడు. సంగప్ప తన దరఖాస్తుతో జిల్లా కమీషనర్ నళిని అతుల్‌ను కలిశాడు. ధరఖాస్తు చూసిన అధికారి ఏం చేయాలో తెలీక ఆశ్చర్యపోయాడు.
తనను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో గత దశాబ్ద కాలంగా జరుగుతున్న తన మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని రైతు సంగప్ప ఆ ధరఖాస్తులో వెల్లడించిన విషయం ఆ నోటా ఈ నోటా పడి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్ద పెద్ద ఐటీ ఉద్యోగులు తమ తమ ఉద్యోగాలను వదిలిపెట్టి వ్యవసాయంలో నిమగ్నం అవుతూ వైవిధ్యభరిత పంటలను సాగు చేస్తున్న నేపథ్యంలో ఓ యువరైతుకు వధువు దొరకక ఏకంగా ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి రావడం ఆశ్చర్యకరమే.