తీహార్ జైల్లో కవిత తొలిరోజు ఎలా సాగిందంటే?

జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఆమె తీహార్ జైల్లో తొలిరోజు సాధారణ ఖైదీలా సాగినట్లుగా సమాచారం.

Update: 2024-03-28 04:43 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను రిమాండ్ కు పంపుతూ కోర్టు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. తొలి రోజు జైల్లో కవిత జీవితం ఎలా సాగిందన్న విషయానికి వస్తే.. ఆమెకు పలు వసతులతో జైల్లో ఉండేందుకు వీలుగా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. తొలి రోజున మాత్రం కవిత జైలు జీవితం కోర్టు ఆదేశాలకు భిన్నంగా సాగినట్లుగా తెలుస్తోంది.

జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఆమె తీహార్ జైల్లో తొలిరోజు సాధారణ ఖైదీలా సాగినట్లుగా సమాచారం. ఆమెకు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు వీలుగా కోర్టు అనుమతి ఉండగా.. ఆమెకు జైలు భోజనాన్ని అందించినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ముగ్గురు సాధారణ మహిళా ఖైదీలతో కవితకు సెల్ కేటాయించినట్లుగా తెలుస్తోంది.

కవితను రాజకీయ వ్యక్తిగా తిహార్ జైల్లో ట్రీట్ చేయటం లేదని.. ఆమెకు ప్రత్యేకంగా ఎలాంటి వీఐపీ సౌకర్యాల్ని కల్పించటం లేదని తెలుస్తోంది. ఇంటినుంచి భోజనం తెప్పించుకునే ప్రొవిజన్ కోర్టు ఇచ్చినప్పటికీ.. తొలిరోజున జైలు నిబందనలకు అనుగుణంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. తొలిరోజున ఎవరిని కలుసుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. జైల్ మాన్యువల్ ప్రకారం జైల్లో మొదటి రోజున ఎవరినీ కలిసేందుకు అనుమతి ఇవ్వరు.

తర్వాత నుంచి మాత్రం వారంలో ఆదివారం మినహా రోజుకు అరగంట చొప్పున ఇద్దరు కుటుంబ సభ్యుల్ని కలుసుకునే వెసులుబాటు ఉంటుంది. అది కూడా ఎవరైనా కవితను కలవాలంటే ఆమె అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆమె ఎవరినైనా కలవాలనుకుంటే కూడా అనుమతిస్తారు. కవితను ఎవరైనా కలుసుకోవాలంటే ఆమె అనుమతితోనే జైలుకు రావాలని సూచన చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యూడీషియల్ రిమాండ్ విధించటం.. ఇందులో భాగంగా తీహార్ జైలుకు తరలించటం తెలిసిందే.

Tags:    

Similar News