జైలు నుంచి కవిత 4 పేజీల లేఖ విడుదల... తెరపైకి సంచలన విషయాలు!

ఇదే సమయంలో కవిత స్వహస్తాలతో రాసిన 4 పేజీల లేఖను విడుదల చేశారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.

Update: 2024-04-09 09:13 GMT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ విషయంలో ఊరట లభించలేదు. ఇప్పటికే తన చిన్నకుమారుడి పరీక్షల నేపథ్యంలో కోరిన మధ్యంతర బెయిల్ ను కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో... మరోసారి కస్టడీ పోడిగించారు. ఇదే సమయంలో కవిత స్వహస్తాలతో రాసిన 4 పేజీల లేఖను విడుదల చేశారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.

అవును... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అనంతరం జరిగిన పరిణామాలు అత్యంత కీలకంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె మరికొన్ని రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగనున్నారు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విధించిన జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియనున్న నేపథ్యంలో... ఆమెను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు.

ఈ సమయంలో ఆమె కస్టడీ గడుపు పొడిగించాలంటూ ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇందులో భాగంగా మరో 14 రోజుల పాటు కస్టడీ కావాల్సి ఉంటుందంటూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం... ఈడీ తరుపు న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. దీంతో... కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. ఫలితంగా... ఈ నెల 23వ తేదీవరకూ కవిత తీహార్ జైలులోనే జ్యుడీషియల్ రిమాండ్ లో ఉండనున్నారు!

కవిత నాలుగు పేజీల లేఖ విడుదల!:

మరోపక్క కవిత స్వహస్తాలతో రాసిన నాలుగు పేజీల లేఖను మీడియాకు విడుడల చేశారు. రౌస్ అవెన్యూ న్యాయమూర్తిని ఉద్దేశించి ఆమె ఈ లేఖ రాశారు! ఇందులో భాగంగా.. మద్యం కుంభకోణం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ వ్యవహారంలో తన ప్రమేయం ఏమాత్రం లేదని వివరించారు. ఇదే సమయంలో... ఆర్థికంగా ఎలాంటి లబ్ది పొందలేదని పేర్కొన్నారు.

ఓ మహిళా రాజకీయ నాయకురాలిగా ఈ కేసు దర్యాప్తు ప్రక్రియలో తాను బాధితురాలిగా మారానని.. తన వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్టను కోల్పోతున్నానని ఆమె పేర్కొన్నారు. సుమారు రెండున్నర సంవత్సరాలుగా ఈడీ, సీబీఐ విచారణలు మీడియా ట్రయల్స్ గా రూపుదిద్దుకుంటున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.

ఇదే క్రమంలో తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ ను అన్ని న్యూస్ ఛానల్స్ లోనూ ప్రసారం చేశారని.. ఇది నేరుగా తన ప్రైవసీని దెబ్బతీసినట్లే అని కవిత పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తుకు తాను ఈడీ, సీబీఐ లకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పిన కవిత... గతంలో నాలుగు సార్లు విచారణకు హాజరైనట్లు తెలిపారు. ఇదే సమయంలో... తన బ్యాంకు అకౌంట్ వివరాలను అందజేసినట్లు పేర్కొన్నారు.

తాను విచారణకు ఎంతగా సహకరిస్తున్నా... సుమారు రెండున్నర ఏళ్లుగా తనిఖీలు, సోదాలు అంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ఈ సమయంలో ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 15న తనను అరెస్ట్ చేశారని కవిత తెలిపారు. తన విచారణ, అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోలేదని ఆమె తన లేఖలో పేర్కొన్నారు!

ఇక గతకొంతకాలంగా దేశంలో ఈడీ, సీబీఐ నమోదు చేస్తోన్న 95 శాతం కేసులు ప్రతిపక్ష నాయకులపైనేనని చెప్పిన కవిత... భారతీయ జనతాపార్టీలో చేరితే ఈ దాడులు, కేసులు, విచారణలన్నీ ఆగిపోతాయంటూ ఆ పార్టీ నాయకులు బాహటంగానే చెబుతున్నారని ఆమె ఆరోపించారు. విచారణ పేరు చెప్పి తనను శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు!

Tags:    

Similar News