చవితి తరువాత చంద్రుడు దిగుతాడా ?!
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ హరీష్ రావులే ప్రధానంగా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి తొమ్మిదినెలలు దాటింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటి వరకు పెద్దగా ప్రజాక్షేత్రంలోకి వచ్చింది లేదు. రెండు సార్లు శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం మినహా పెద్దగా ప్రజల వద్దకు వెళ్లలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ హరీష్ రావులే ప్రధానంగా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీకి హామీల అమలుకు గడువు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ బయటకు రావడం లేదని, ఈ నెల 7న వినాయక చవితి. ఆ తర్వాత వినాయకుల నిమజ్జన ఉత్సవాలు పూర్తయిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చి కేసీఆర్ పర్యటనలు చేస్తారని ఒక వాదన వినిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులతోనే కార్యక్రమాలు నడిపిస్తారని ఒక వాదన వినిపిస్తుంది.
2026లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని, పార్టీ పటిష్టతకు ఇప్పటికే ఒక బృందాన్ని తమిళనాడుకు పంపించి అక్కడ డీఎంకే పార్టీ విధానాలను అధ్యయనం చేయించిన నేపథ్యంలో దాంతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో బీజేడీ, శివసేన పార్టీలను అధ్యయనం చేసి బీఆర్ఎస్ పటిష్టతకు కేసీఆర్ చర్యలు తీసుకుంటారని, కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలకు యువ నాయకత్వాన్ని తయారు చేసి 2028 ఎన్నికలకు సిద్దం చేస్తారని అంటున్నారు. కొత్త నియోజకవర్గాల ఏర్పాటు నాటికి పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం మీదనే దృష్టి పెడతారని కొందరు అంటున్నారు.
ఇప్పటి వరకు రుణమాఫీ చేశాం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నా మెజారిటీ రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు. రైతుభరోసా ఎప్పటి నుండి ఇస్తారు ? ఎవరికి ఇస్తారు ? అన్న విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో రైతుల డిమాండ్లనే ముందుపెట్టి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కేసీఆర్ పర్యటనలకు వస్తారని కొందరు చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.