సవాల్ అన్నంతనే తొడ కొట్టే కేసీఆర్ కామ్ గా ఎందుకు?
పదే పదే సభకు రావాలన్న రేవంత్ మాటకు భిన్నంగా గులాబీ బాస్ నోటి నుంచి సభకు తాను ఎందుకు రాలేకపోతున్నది చెప్పకపోవటం తెలిసిందే.
గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే తెలుగుప్రజలకు ఆయన కొన్నిదశాబ్దాలుగా తెలుసు. ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నరేళ్లు పాలించిన ఆయన.. తన పాలన ఎలా ఉంటుందన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చూపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. విపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించే కేసీఆర్.. రాజకీయ ప్రత్యర్థులు ఏదైనా సవాలు విసిరితే వెంటనే రియాక్టు అవుతారు. కాకుంటే.. విపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే.
కాస్త వెనక్కు వెళ్లి విషయాల్ని గుర్తు తెచ్చుకుంటే.. తెలంగాణ ఉద్యమవేళలో.. నాటి కాంగ్రెస్ సీనియర్ నేతల నోటి నుంచి వచ్చిన మాటలకు అత్యంత వేగంగా రియాక్టు అయి.. తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ఉప పోరుతో తెలంగాణ సెంటిమెంట్ ను ఎంతలా రగల్చారన్న విషయం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ తీరు ఏ ఒక్కసారో.. రెండుసార్లకో పరిమితం కాకుండా పదే పదే వ్యవహరించటం తెలిసిందే.
అలాంటి కేసీఆర్.. తాజాగా మాత్రం భిన్నంగా ఉండటం.. ఎంతలా ప్రశ్నించినా గమ్ముగా ఉండటం గమనార్హం. సభకు వెళ్లకుండా ఉంటున్న కేసీఆర్ ను.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని కోరుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విపక్ష నేతగాకు ఆయనకు గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తామన్న హామీని ఇస్తున్నారు. ఆయన ఏమైనా చెప్పాలంటే సభకు రావాలంటూనే.. ఆయన సమాధానాలు చెప్పాల్సిన అంశాలు బోలెడన్ని ఉన్నాయని వ్యాఖ్యానిస్తుండటం తెలిసిందే.
పదే పదే సభకు రావాలన్న రేవంత్ మాటకు భిన్నంగా గులాబీ బాస్ నోటి నుంచి సభకు తాను ఎందుకు రాలేకపోతున్నది చెప్పకపోవటం తెలిసిందే. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ సభకు రావాలే కానీ.. సాయంత్రం వరకు సభలో చర్చ జరుపుదామన్న ఓపెన్ ఆఫర్ ఇచ్చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఆయన అంత ధీమాగా ఉండటమే గులాబీ బాస్ కేసీఆర్ కు నచ్చట్లేందంటున్నారు. పదే పదే సభకు రావాలంటూ ఆహ్వానించటంలోనే వ్యూహం ఉందని.. ఆయన మాటలకు టెంప్టు అయితే అడ్డంగా బుక్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఈ కారణంగానే కేసీఆర్ స్పందించకుండా గమ్మున ఉంటున్నారని చెబుతున్నారు.
ఆసక్తికర సవాలు విసిరినంతనే తొడ కొట్టే అలవాటు కేసీఆర్ కు ఉన్న విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు అవగాహన ఉందన్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే గులాబీ బాస్ స్పందించటం లేదంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సభకు వచ్చే మైలేజీ కంటే డ్యామేజీనే ఎక్కువని.. అందుకే రేవంత్ పదే పదే సవాలు విసురుతున్నా.. స్పందించకుండా గమ్మున ఉంటున్నాంటున్నారు. ఒకవేళ.. అదే కేసీఆర్ వ్యూహమైనప్పుడు నల్గొండ సభలో మాదిరి అనవసరంగా తన పరుష మాటలతో కెలికి మళ్లీ నాలుగు మాటలు అదనంగా అనిపించుకోవటంలో అర్థమేంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు.