కేసీఆర్ కు 'కరెంట్' షాక్.. ఒప్పందాలపై కమిషన్ తాజా నోటీసు

పదేళ్లు అప్రతిహతంగా సాగిన కేసీఆర్ ప్రభుత్వంలో తాము సాధించిన విజయాల్లో విద్యుత్ అంశాన్ని తరచూ ప్రస్తావిస్తుంటారు గులాబీ బాస్

Update: 2024-06-12 04:31 GMT

పదేళ్లు అప్రతిహతంగా సాగిన కేసీఆర్ ప్రభుత్వంలో తాము సాధించిన విజయాల్లో విద్యుత్ అంశాన్ని తరచూ ప్రస్తావిస్తుంటారు గులాబీ బాస్. ఆ మాటకు వస్తే ప్రతిపక్ష నేతగా కూడా ఆయన రేవంత్ సర్కారు విద్యుత్ అంశంలో ఫెయిల్ అయినట్లుగా ఘాటు విమర్శలు చేయటం తెలిసిందే. ఆయన తన ఇమేజ్ ను పెంచుకోవటానికి విద్యుత్ అంశాన్నితరచూ ప్రస్తావిస్తుంటారు. ఇప్పుడు అదే విద్యుత్ అంశం కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాకిచ్చేలా మారింది. యాదాద్రి.. భద్రాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణంతో పాటు.. ఛత్తీస్ గఢ్ లో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఈ నెల 15 లోపు సమాధానాలు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేయటం ఆసక్తికరంగా మారింది.

ఈ శనివారం తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పంపాలంటూ కమిషన్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న జస్టిస్ ఎల్ ణరసింహారెడ్డి పేర్కొన్నారు. కమిషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ నోటీసులకు సమాచారం ఇచ్చేందుకు ఈ నెలాఖరు వరకు టైం అడిగారని.. కానీ తాము ఈ నెల 15 వరకు టైం ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ విచారణలో వెలుగు చూసిన అంశాల్ని ఆయన వెల్లడించారు.

ప్రాథమికంగా యాదాద్రి.. భద్రాద్రి థర్మల్ విద్యుత్కేంద్రాల నిర్మాణం టెండరు పద్దతిలో కాకుండా నామినేషన్ విధానంలో చేపట్టినట్లుగా వెల్లడించారు. దీంతో పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడినట్లుగా గుర్తించారు. ఆయా అంశాల్లో సమగ్ర విచారణ కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరో పాతిక మంది కీలక అధికారులకు.. ప్రజాప్రతినిధులకు లేఖలు రాసినట్లుగా పేర్కొన్నారు.

ఆయా అంశాల్లో సమగ్ర సమాచారం కోసం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వగా.. జూన్ చివరి వరకు టైం కోరినట్లుగా పేర్కొన్నారు. అయితే.. తాము ఈ వారాంతం వరకు మాత్రమే గడువు ఇస్తున్నట్లుగా చెప్పారు. తాము అడిగిన సమాచారం కోసం నోటీసులు అందుకున్న వారి విషయంలోకి వెళితే..అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారంతా ఉండటం గమనార్హం.

- మాజా సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు

- నాటి ముఖ్య కార్యదర్శులు సురేష్ చందా

- అర్విందకుమార్

- ఎస్ కే జోషి

- అజయ్ మిశ్రా తదితరులు ఉన్నారు.అయితే వారు మాత్రం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము అమలు చేశామే తప్పించి ఇంకేమీ చేయలేదని వారు చెబుతున్నారు. కేసీఆర్ పాలనలో విద్యుత్ పైనిర్ణయాలు ఎలా ఉండేవన్న దానికి నిదర్శనంగా కొన్ని ఉదాహరణల్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉందన్న కారణంగా రెండు వేల మెగావాట్లను దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థల వద్ద కొనుగోలు చేసేందుకు వీలుగా ఒక జీవో జారీ చేశారని.. ఆ తర్వాత ఎక్కడి నుంచైనా కరెంట్ కొనుగోలు చేయొచ్చంటూ పాత జీవోలను మార్చి మరో జీవోను ఇచ్చినట్లుగా ఎస్ కే జోషి కమిషన్ కు వివరించినట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియ లేకుండానే ఒప్పందాలు చేసుకోవటాన్ని ప్రశ్నిస్తున్నారు.

కమిషన్ పలువురిని ప్రశ్నించే క్రమంలో ఒక ఆసక్తికర అంశం వెల్లడైంది. ఛత్తీస్ గఢ్ తో కేసీఆర్ సర్కారు ఒప్పందం చేసుకునే నాటికి ఛత్తీస్ గడ్ విద్యుత్కేంద్రం నిర్మాణ దశలోఉందన్న విషయాన్ని గుర్తించారు. నిర్మాణంలో ఉన్న విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవటం విస్మయానికి గురి చేస్తోంది. చివరి మూడేళ్లతర్వాత 2017లో కరెంటు సరఫరా మొదలుపెట్టిన సదరు రాష్ట్రం నాలుగేళ్ల పాటు కొనసాగించి.. ఆ తర్వాత ఆపేసినట్లుగా గుర్తించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎంత నష్టం వాటిల్లిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.చూస్తుంటే తనకు ఇమేజ్ తెచ్చి పెట్టిన విద్యుత్ అంశంలోనే ఆయనకు పూడ్చుకోలేనంత డ్యామేజ్ జరగనుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News