నా ఆమరణ దీక్షతోనే తెలంగాణ వచ్చింది: కేసీఆర్

ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-11-13 11:03 GMT

కాంగ్రెస్ పార్టీ వల్లే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని, తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన ఘనత తమ పార్టీ దేనిని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ వల్లే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందని, లేకుంటే ఎన్నటికీ ప్రత్యేక తెలంగాణ వచ్చేది కాదని అంటున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ ఏర్పాటు పదేళ్లు ఆలస్యమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004లోనే ప్రత్యేక తెలంగాణ రావాల్సిందని, కానీ కాంగ్రెస్ వల్లే ఆలస్యం అయిందని కేసీఆర్ ఆరోపించారు.

తాను ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ఆనాడు ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది, ఉద్యమాలను అణచివేసింది కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎంతో మంది అమరులయ్యారని, ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటు వేసే ముందు అభ్యర్థులు, పార్టీల మంచి చెడులు, అభ్యర్థుల గుణగణాలు చూడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అశ్వరావుపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కులమత బేధం లేకుండా అందర్నీ సమానంగా చూస్తున్నామని, అందుకే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేసీఆర్ చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కరెంటు సమస్య ఉండేదని, ఇప్పుడు రైతులు, పరిశ్రమలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయని, ప్రజలు ఆగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇక, ధరణి పోర్టల్ లో గోల్ మాల్ కు ఆస్కారం లేదని అన్నారు.

గోదావరిపై సీతారామ ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన ఏ పార్టీకి రాలేదని, ఆ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. 70 శాతం పూర్తయిన ఆ ప్రాజెక్టును రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని జోస్యం చెప్పారు. ధరణి పోర్టల్ తీసివేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, అది జరిగితే రైతుబంధుతోపాటు ఇతర పరిహారాలు వారికి ఎలా అందుతాయని కేసీఆర్ ప్రశ్నించారు.

Tags:    

Similar News