బుక్ చేద్దామనుకొని అడ్డంగా బుక్ అయిన కేసీఆర్

‘చెడపకురా చెడేవు’ అంటూ మన పెద్దోళ్లు అప్పుడెప్పుడో సుద్దులు చెప్పారు. గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఆ చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు.

Update: 2024-04-30 04:40 GMT

‘చెడపకురా చెడేవు’ అంటూ మన పెద్దోళ్లు అప్పుడెప్పుడో సుద్దులు చెప్పారు. గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఆ చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు. రేవంత్ సర్కారు కొలువు తీరి సరిగ్గా నాలుగు నెలలు మాత్రమే అయ్యింది. పవర్లోకి వచ్చిన కొద్దిరోజులకే లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చేసింది. పాలన మీదా.. ప్రభుత్వ యంత్రాంగం మీదా పట్టు తెచ్చుకునేలోపే.. మరో ఎన్నికల పరీక్షకు సిద్ధమైన రేవంత్ సర్కారు ఆయుష్షు తీరిపోయిందని.. ఏడాదిలో సర్కారు ఛేంజ్ కావటం ఖాయమన్న మాటలు అదే పనిగా చెబుతున్న కేసీఆర్ అండ్ కో.. మరో అడుగు ముందుకేసి..ప్రతి చిన్న విషయంలోనూ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు.

ఇప్పటికే అలాంటి ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్న కేసీఆర్.. తాజాగా మరోసారి బుక్ అయ్యారు. నిత్యం రేవంత్ సర్కారును బద్నాం చేయటం.. ఇమేజ్ డ్యామేజ్ చేయటం తప్పించి.. వెనుకా ముందు చూసుకోని తత్త్వం కేసీఆర్ ను ఇబ్బందుల్లోకి పడేస్తోంది. అధికారం మీద ఆయన అత్యాశ ఆయన మీద ఉన్న గౌరవాన్ని తగ్గించేలా చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎపిసోడ్ నిలుస్తుంది.

ఓయూ వర్సిటీ వార్డెన్ పేరుతో సోమవారం మధ్యాహ్నం ఒక నోటీసు విడుదలైంది. దాని సారాంశం ఏమంటే.. తీవ్రమైన నీటి కొరత.. విద్యుత్ కోతల నేపథ్యంలో వర్సిటీలోని హాస్టల్స్ ను నడపలేకపోతున్నాం. వెంటనే హాస్టల్స్ ఖాళీ చేయండని. ఈ మాత్రానికే వెంటనే కేసీఆర్ అండ్ కో స్పందించింది. ఈ నోటీసు మర్మం ఏమిటో గుర్తించలేదు. అదే సమయంలో వర్సిటీ యంత్రాంగం సైతం ఇటీవల రాజకీయ పరిణామాల్ని పట్టించుకోకుండా ఎప్పటిలానే తమ ధోరణిని తూచా తప్పకుండా పాటించింది.

ప్రతి ఏడాది వేసవిలో హాస్టల్స్ ను ఖాళీ చేయించేందుకు వీలుగా ఇలా నోటీసులు జారీ చేస్తారు. గత ఏడాది కేసీఆర్ సర్కారు హయాంలోనూ తాజాగా విడుదల చేసిన నోటీసునే విడుదల చేశారు. ఈ చిన్న విషయాన్ని కేసీఆర్ అండ్ కో మిస్ అయ్యింది. రేవంత్ సర్కారును బద్నాం చేయటమే లక్ష్యంగా.. అత్యుత్సాహంతో తెలంగాణ మొత్తం ఆగమాగం అయిపోయిందని.. రేవంత్ సర్కారు కొలువు తీరిన కొద్ది రోజులకే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందన్నట్లుగా తాను కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఎక్స్ వేదిక (ట్విటర్) మీద పోస్టు చేశారు. దీంతో.. కొందరు అసలు విషయాన్ని వాకబు చేసి.. గత ఏడాది కేసీఆర్ సర్కారు హయాంలో ఉస్మానియా వర్సిటీ విడుదల చేసిన పాత నోటీసును సర్క్యులేట్ చేశారు. దీంతో.. రేవంత్ ప్రభుత్వాన్ని బుక్ చేద్దామనుకున్న గులాబీ బ్యాచ్ అడ్డంగా బుక్ అయ్యింది.

కొసమెరుపు ఏమంటే.. కేసీఆర్ పోస్టు చేసిన దానిని షేర్ చేసిన మాజీ మంత్రి కం మేనల్లుడు హరీశ్ రావు సైతం వెనుకా ముందు చెక్ చేయకుండానే.. రేవంత్ సర్కారుపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. దీంతో.. అధికారం కోసం గులాబీ బ్యాచ్ ఎంత తహతహలాడుతుందన్న విషయం కళ్లకు కట్టినట్లుగా కనిపించటమే కాదు.. పవర్ లేకుండా కొద్ది రోజులు కూడా ఉండలేరా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం అన్నది అత్యాశతో సొంతం కాదని.. నిజాయితీగా ప్రజల కోసం శ్రమిస్తే.. దానంతట అదే వస్తుందన్న చిన్న లాజిక్ పింకీ బ్యాచ్ ఎప్పటికి అర్థం చేసుకుంటుందో?

Tags:    

Similar News