సరిగ్గా 40 ఏళ్ల తర్వాత కేసీఆర్ కు ఓటమి..
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత అరుదైన సీన్ ఆదివారం నాటి ఫలితాల్లో వెల్లడైంది. అదేమంటే సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఓటమి పాలవడం.
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత అరుదైన సీన్ ఆదివారం నాటి ఫలితాల్లో వెల్లడైంది. అదేమంటే సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఓటమి పాలవడం. అసలు ఆయన గజ్వేల్ తో పాటు కామారెడ్డిని ఎంచుకోవడమే ఆశ్చర్యకరం. గజ్వేల్ లో అద్భుతమైన డెవలప్ మెంట్ చేశారు కేసీఆర్. ఓ పదేళ్ల కిందటి గజ్వేల్ కు ఇప్పటికి అసలు పోలికే లేదంటే నమ్మాలి. కానీ, ఎందుకనో ఈసారి కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగి చేదు అనుభవం ఎదుర్కొన్నారు. ఈ ఓటమి కేసీఆర్ రాజకీయ జీవితంలో చెరగిపోలేనిది అని చెప్పవచ్చు.
తొలి ఓటమి తర్వాత మళ్లీ..
కేసీఆర్ 1970ల చివర్లో సింగిల్ విండో చైర్మన్ గా రాజకీయ జీవితం ప్రారంభించారు. తెలుగుదేశం ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 1983 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున సిద్దిపేట నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆయన రాజకీయ గురువుగా భావించే అనంతుల మదన్ మోహన్ చేతిలో 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ, 1985లో వచ్చిన ఎన్నికల్లో గెలుపొందారు. అప్పటినుంచి దాదాపు రెండు దశాబ్దాలు సిద్దిపేట నుంచి గెలుస్తూ వచ్చారు. 1999 వరకు టీడీపీ నుంచి, 2001 ఉప ఎన్నిక నుంచి సిద్దిపేటలో విజయం సాధించారు. 2004లో చివరగా అక్కడినుంచి నెగ్గారు.
తొలిసారి రెండు అసెంబ్లీ సీట్లలో పోటీ
2004లో తొలిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా పోటీచేసిన కేసీఆర్.. ఎంపీగా కొనసాగుతూ ఎమ్మెల్యే పదవిని వదులుకున్నారు. మళ్లీ తెలంగాణ వచ్చేవరకు అంటే 2014 దాకా ఎమ్మెల్యేగా పోటీకి దిగలేదు. 2014లో గజ్వేల్ ను ఎంచుకుని, మెదక్ ఎంపీగానూ నెగ్గారు. దీనికిముందు 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా విజయం సాధించారు. అంటే.. మెదక్, కరీంనగర్, మహబూబ్ నగర్ మూడు జిల్లాల్లోనూ ఓ అభ్యర్థిగా కేసీఆర్ జయకేతనం ఎగురవేశారు.
నాలుగోసారి జిల్లా మారి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నుంచి ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసిన కేసీఆర్ మొత్తమ్మీద నాలుగో జిల్లా నుంచి పోటీ చేస్తున్నట్లు రికార్డులకెక్కారు. కామారెడ్డిలోనూ నెగ్గితే ఈ రికార్డు మరింత మెరుగ్గా ఉండేది. కానీ, అక్కడ ఓటమి కేసీఆర్ అద్భుత కెరీర్ లో ఓ మచ్చగా మిగిలిపోయింది. అంతేకాదు.. 1983 తర్వాత సరిగ్గా 40 ఏళ్లకు మరో ఓటమిని మూటగట్టుకున్నారు. వాస్తవానికి 2006 కరీంనగర్ ఉప ఎన్నిక, 2009 మహబూబ్ నగర్ లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ విజయానికి చాలా కష్టపడ్డారు. గెలుపును చేజారనీయలేదు. అయితే, ఈసారి మాత్రం భిన్నమైన ఫలితం వచ్చింది. ఈయనపై కామారెడ్డిలో పోటీచేసిన రేవంత్ కూాడా ఓడారు.. ఆయనకు 2018 ఎన్నికల తర్వాత ఇది రెండో ఓటమి. ఇక ఈటల రాజేందర్ గజ్వేల్ లో కేసీఆర్ చేతిలో ఓడారు. ఆయన 20 ఏళ్లలో తొలి ఓటమి.
కొసమెరుపు: కేసీఆర్ 2009లో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసినప్పుడు మహా కూటమిలో భాగంగా కొడంగల్ టీడీపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి బరిలో నిలిచారు. అప్పట్లో కేసీఆర్, రేవంత్ కలిసి సభల్లో పాల్గొన్నారు. ఇప్పుడదే కేసీఆర్ పై రేవంత్ కామారెడ్డిలో పోటీకి దిగారు. ఇద్దరూ ఓడిపోయారు. కానీ, పార్టీ కూడా ఓడడంతో కేసీఆర్ సీఎం పదవి నుంచి తప్పుకొన్నారు. ఆ పదవిలోకి రేవంత్ వచ్చారు.