జయశంకర్ సారుకు నివాళులు అర్పించే ఫోటో పంపే తీరిక లేదా కేసీఆర్?
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సారు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సారు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సారుకు తానెంతో సన్నిహితుడని.. ఆయన శిష్యుడిగా చెప్పుకుంటూ.. ఆయన ఆశయ సాధనే తన లక్ష్యమని చెప్పే గులాబీ బాస్ కేసీఆర్ ద్వందనీతి ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా తాజాగా నిర్వహించిన ఆయన వర్థంతి మరోసారి నిరూపించింది. ప్రొఫెసర్ జయశంకర్ అన్న మహనీయుడే లేకపోతే కేసీఆర్ లేరు. ఎందుకంటే కేసీఆర్ వినిపించిన వాదన.. నడిచిన ఉద్యమ నడక మొత్తం జయశంకర్ సారు ఆలోచనలకు తగ్గట్లు తాను పని చేస్తున్నట్లుగా లక్షలసార్లు చెప్పుకున్నారు కేసీఆర్.
అలాంటి పెద్ద సారు వర్థంతిని కేసీఆర్ ఎంత ఘనంగా నిర్వహించాలి? పదేళ్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారంటే దానికి మూలం జయశంకర్ సారే. అలాంటి సారు వర్థంతిని విపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఘనంగానిర్వహించాలి కదా? కానీ.. ఆయన చేసిందేంటి? ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ సారు చిత్ర పటానికి నివాళులు అర్పించి.. ఆయన్ను గుర్తు చేసుకోవటం.. దానికి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని నిర్వహించటం లాంటివి జరిగాయి.
కానీ.. అదే కేసీఆర్ విషయానికి వస్తే.. తూతూ మంత్రంగా ఒక స్టేట్ మెంట్ మాత్రమే తప్పించి.. జయశంకర్ సారుకు నివాళులు అర్పిస్తున్నట్లుగా కనీసం ఒక ఫోటో కూడా విడుదల చేయలేదు కేసీఆర్. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కేసీఆర్ కుమారుడు కం మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం ప్రొఫెసర్ సారుకు నివాళులు అర్పిస్తూ ఒక ఫోటోను విడుదల చేశారు. కానీ.. తీరుబడి లేదేమోకానీ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కనీసం ఒక ఫోటోను సైతం విడుదల చేయలేదు.
నిజానికి.. ప్రొఫెసర్ జయశంకర్ సారు సిద్ధాంతాన్ని.. ఆయన ఆలోచనల్ని తన మాటల్లోనూ.. ప్రసంగాల్లోనూ పదే పదే ప్రస్తావించే కేసీఆర్.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సారు యాదికి నిదర్శనంగా భారీ ప్రోగ్రాం నిర్వహించని లోటును తెలంగాణవాదులు ప్రస్తావిస్తుంటారు. అధికారంలో ఉన్నప్పుడు కుదరకపోవచ్చు. ఆ అధికారం చేజారిన తర్వాతైనా గుర్తు లేకపోవటం దేనికి నిదర్శనం కేసీఆర్?