జగన్ ను కాంగ్రెస్ వేధించింది... కేసీఆర్ కీలక వ్యాఖ్యలు!
తాజాగా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి స్పందించిన కేసీఆర్.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల చివరి రోజున తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ తన ప్రసంగంలో.. తెలంగాణ ను ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని, 41 ఏండ్లపాటు ఆ పార్టీ తెలంగాణ ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచిందని విమర్శించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్థావన తీసుకురావడం గమనార్హం.
అవును... తాజాగా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి స్పందించిన కేసీఆర్... మాటల మధ్యలో జగన్ ని కూడా కాంగ్రెస్ పార్టీ వేధించిందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు అడుగడుగునా అన్యాయం చేస్తూ.. వేల మంది పిల్లలను పొట్టనపెట్టుకున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇందులో భాగంగా... తెలంగాణ చరిత్రను గుర్తు చేసుకుంటే ఈ ప్రాంతానికి ద్రోహం చేసిన వారసత్వం కాంగ్రెస్ కు ఉందని అన్నారు కేసీఆర్. 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పదేళ్లపాటు అధికారంలో లేకపోవడంతో.. తమతో పొత్తు పెట్టుకుని తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయ లబ్ధి పొందారని తెలిపారు.
అయితే నాడు టీఆరెస్స్ వల్ల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... తర్వాత కాలంలో యూ-టర్న్ తీసుకుందని అన్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎవరినీ వదల్లేదు అని చెప్పిన కేసీఆర్... ప్రస్తుత ఏపీ సీఎం జగన్ ను కూడా వేధించిందని అన్నారు.
ఈ సందర్భంగా... "కాంగ్రెస్ జగన్ కోసం కష్టాలు సృష్టించింది.. ఫలితంగా ఆయన పార్టీని వీడవలసి వచ్చింది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్ తప్పుడు కేసులతో ఇరుక్కుపోయినా... కడప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు" అని కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో గుర్తు చేశారు.
"దీంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తమ బలాన్ని కోల్పోతున్నామని పసిగట్టిన కాంగ్రెస్.. ఈ ప్రాంతంలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేలా తెలంగాణను ఇచ్చే అవకాశం లేదని తేల్చిందని అన్నారు. అయితే తెలంగాణ ప్రజలు పట్టు విడవలేదు" అని కేసీఆర్ స్పష్టం చేశారు!
ఇలా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.