కేసీయార్ రాజ్యం తెచ్చే రాజశ్యామల యాగానికి అంతా రెడీ...!
ఈ యాగానికి నవంబర్ 1 నుంచి మూడు రోజుల నిర్వహించనున్నారు. యాగశాలను సిద్ధిపేటలోని ఎర్రపల్లిలో కేసీయార్ కి చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేశారు.
కేసీయార్ కి ఆధ్యాత్మిక భావాలు సెంటిమెంట్లు ఎక్కువ. ఆయనలో దైవ చింతన భక్తి ప్రపత్తులు కూడా ఎక్కువే. ఆయన గతంలో తెలంగాణా సాధన కోసం యాగాలు చేశారని ప్రచారంలో ఉంది. ఇక రెండవ మారు అధికారంలోకి రావడం కోసం 2018లో కేసీయార్ స్వయంగా రాజశ్యామల యాగం చేశారు.
దాని ఫలితంగా ఆయన రెండవసారి దిగ్విజయంగా సీఎం అయ్యారని అంటారు. కేసీయార్ చేత రాజశ్యామల యాగం చేయించిన వారు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర మహా స్వామి వారు. ఆ తరువాత అదే స్వామి జగన్ కోసం రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం కోరుతూ యాగం చేశారని చెబుతారు. ఫలితంగా ఏపీలో కూడా జగన్ సీఎం అయ్యారని అంటారు.
ఇపుడు ముచ్చటగా మూడవసారి కేసీయార్ సీఎం కావాలని అనుకుంటున్నారు. దాని కోసం కత్తులు డాలూ పట్టుకుని ఎన్నికల క్షేత్రంలో యుద్ధం మొదలెట్టేశారు. అది అలా సాగుతూండగానే ఇపుడు ఆధ్యాత్మికత వైపు మళ్ళారు. తనకు కలసి వచ్చిన రాజశ్యామల యాగాన్ని ఆయన చేసేందుకు సిద్ధపడుతున్నారు.
ఈ యాగానికి నవంబర్ 1 నుంచి మూడు రోజుల నిర్వహించనున్నారు. యాగశాలను సిద్ధిపేటలోని ఎర్రపల్లిలో కేసీయార్ కి చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన పురోహితులు ఈసారి కూడా రాజశ్యామల యాగంలో పాలు పంచుకోనున్నారని తెలుస్తోంది.
అదే విధంగా కర్నాటకకు చెందిన పురోహితులతో కలుపుకుని దాదాపుగా రెండు వందల మందికి పైగా ఈ మూడు రోజుల యాగంలో కీలక భూమిక పోషిస్తారని అంటున్నారు. ఇక ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించి కేసీయార్ అమ్మ వారి దయ కోసం యాగ దీక్షని తీసుకుని అందులో పాల్గొంటారని తెలుస్తోంది.
రాజశ్యామల అమ్మ వారి కోసం తెలంగాణాలో రెండు ఎకరాల స్థలాన్ని ఇచ్చి మరీ విశాఖ శారదా పీఠం వారి ఆద్వర్యంలో నిర్మింపచేస్తున్న కేసీయార్ కి మరోసారి ఆ సెంటిమెంట్ కలసి వస్తుందా అన్న చర్చ సాగుతోంది. రాజశ్యామల అమ్మ వారిని ఎవరైతే భక్తి ప్రపత్తులతో పూజిస్తారో వారికి రాజ్యప్రాప్తి సిద్ధిస్తుంది అని ప్రతీతి.
వర్తమాన కాలంలో చూసుకుంటే జగన్ కేసీయార్ అలా రాజ్యాలను అందుకున్న వారిగా ఉన్నారు. ఇక రాజశ్యామల అమ్మవారి యాగం చేయకపోయినా ఆమెను దర్శించుకుని అర్చనలు చేసిన వారు ఎందరో రాజకీయ నేతలు ఉన్నారు. కేసీయార్ సైతం ఆ తల్లి కరుణ కోసం ఇపుడు సరైన టైం లో యాగాన్ని చేపడుతున్నారు. రాజశ్యామల అమ్మవారి యాగం మరోసారి ఈ విధంగా చర్చకు వస్తోంది. హోరా హోరీగా సాగుతున్న పోరులో కేసీయార్ మూడవసారి సీఎం అవుతారా లేదా అన్న చర్చ ఒక వైపు ఉంది. రానున్న మూడు రోజులూ యాగం వైపు అందరి చూపూ ఉంటుంది అని అంటున్నారు.