వివాదాల్లో ఉన్నా కొందరికి మోదం.. కొందరికి ఖేదం!

ఇందులో వివాదాల్లో కూరుకుపోయిన కొంతమంది ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ ఝులక్‌ ఇచ్చారు. అయితే మరికొందరికి మాత్రం సీట్లు ఇచ్చారు.

Update: 2023-08-21 14:44 GMT

తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో వివాదాల్లో కూరుకుపోయిన కొంతమంది ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ ఝులక్‌ ఇచ్చారు. అయితే మరికొందరికి మాత్రం సీట్లు ఇచ్చారు. దీంతో అధినేత మనసును అర్థం చేసుకోలేక బీఆర్‌ఎస్‌ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.

ముఖ్యంగా జానకీపురం సర్పంచ్‌ నవ్య వ్యవహారంలో అపఖ్యాతి పాలైన మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు సీటు దక్కలేదు. ఒక సినీ తార విషయంలోనే ఆయన గతంలో తన మంత్రి పదవిని పోగొట్టుకున్నారని గాసిప్స్‌ వినిపించాయి. అయినా సరే ఇప్పుడు సర్పంచ్‌ నవ్యపై వేధింపులకు పాల్పడటం, ఆమె స్వయంగా రాజయ్యపై మీడియా సాక్షిగా ఓ రేంజులో ఫైర్‌ కావడం కలకలం రేపింది. మరోవైపు స్టేషన్‌ ఘనపూర్‌ కే చెందిన బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో తీవ్ర విభేదాలు, బహిరంగంపై ఆయనను దూషించడం ఇవన్నీ రాజయ్యకు సీటు దక్కకపోవడానికి కారణాలుగా చెబుతున్నారు. రాజయ్య సీటు కోసం రాజశ్యామల యాగం చేసినా ఫలితం దక్కలేదు.

ఇక జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పరిస్థితికి ఇంట్లోనే పోరు ఉంది. ఒక భూమి వ్యవహారం విషయంలో ఆయన కుమార్తె స్వయంగా ఆరోపణలు చేయడం.. ఈ వివాదం కొన్ని రోజులపాటు మీడియాలో నానడం ముత్తిరెడ్డికి తీవ్ర నష్టం చేకూర్చింది. తనకు సీటు రాదనే విషయం తెలుసుకున్న ఆయన గత కొన్ని రోజులుగా కేసీఆర్‌ పై ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేసినా అది ప్రయోజనాన్ని ఇవ్వలేదు. సొంత కూతురే ఆయన భూకబ్జా ఆరోపణలు చేయడంతో ఆయనకు తొలి జాబితాలో సీటు దక్కలేదు. ప్రస్తుతం జనగాంకు అభ్యర్థిగా ఎవరిని ప్రకటించికపోయినా రెండో జాబితాలోనూ ముత్తిరెడ్డికి సీటయితే దక్కే పరిస్థితి లేదని చెబుతున్నారు.

ఇక కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున గెలిచి బీఆర్‌ఎస్‌ లో చేరారు. ముఖ్యంగా వనమా తన కుమారుడు రాఘవేంద్ర వ్యవహారంలో తీవ్రంగా అపఖ్యాతి పాలయ్యారు. ముఖ్యంగా రాఘవేంద్ర మహిళలను వేధించేవాడని.. తన మాట విననివారిపై కక్ష సాధింపు చర్యలకు దిగేవాడని ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఖమ్మంలో భార్యాభర్తలు రాఘవేంద్రపై ఆరోపణలు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వనమా సీటు దక్కదని అంతా అంచనాకొచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ గడల శ్రీనివాసరావు తానే కొత్తగూడెం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తానని చెప్పుకుంటూ వచ్చారు. అయితే కేసీఆర్‌.. వనమా వెంకటేశ్వరరావుపైనే నమ్మకం ఉంచారు.

ఇక తాజాగా ఒక మహిళతో సన్నిహితంగా మాజీ ఎమ్మెల్యే మదన్‌ లాల్‌ దిగిన ఫొటోలు వైరల్‌ గా మారాయి. అయినప్పటికీ ఖమ్మం జిల్లా వైరాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాములు నాయక్‌ ను పక్కనపెట్టి మదన్‌ లాల్‌ కు కేసీఆర్‌ సీటు కేటాయించారు.

అలాగే బెల్లంపల్లి సిట్టింగ్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారం కూడా మీడియాలో బాగా నానింది. శేజల్‌ అనే మహిళ.. దుర్గం చిన్నయ్యపై అనేక ఆరోపణలు చేసింది. ఆయనను తనను లైంగికంగా వేధించాడని, తన దగ్గర లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడని ఆరోపించింది. ఏకంగా ఢిల్లీ దాకా వెళ్లి నిరసనకు దిగింది. అయినప్పటికీ దుర్గం చిన్నయ్యకే కేసీఆర్‌ ఈ దఫా కూడా సీటు కేటాయించారు.

ఇక ఆసిఫాబాదులో ఆత్రం సక్కు ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై పెద్ద ఆరోపణలు లేకపోయినా ఆయనను పక్కనపెట్టారు. అక్కడ కోవా లక్ష్మికి సీటు ఇచ్చారు. ఆత్రం సక్కును వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆత్రం సక్కుకు సీటు కేటాయించలేదని అంటున్నారు.

అదేవిధంగా ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌ రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటం వంటి కారణాలతో ఆయనకు కూడా సీటు దక్కలేదు. అక్కడ బండారు లక్షా్మరెడ్డికి కొత్తగా సీటు ఇచ్చారు.

వేములవాడలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ కు కూడా సీటు లభించలేదు. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉందని.. అది వదులుకోకుండా దాన్ని దాచిపెట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆయనపై కోర్టులో కేసులు వేశారు. ప్రస్తుతం ఇవి సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయి. ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నమనేని రమేశ్‌ కూడా సీటు లభించలేదని టాక్‌.

Tags:    

Similar News