కేసీఆర్ సర్కారు జమానాలో.. బైక్ పై ఒకేసారి 126 గొర్రెలు
మరీ ఇంత ఆరాచకమా? అన్న మాట తరచూ బీఆర్ఎస్ నేతల నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది.
మరీ ఇంత ఆరాచకమా? అన్న మాట తరచూ బీఆర్ఎస్ నేతల నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. వారి మాటలకు చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదన్న విషయాన్ని వారికి చెప్పినా వినరు. ఉల్టాగా విరుచుకుపడతారు. అయితే.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయన్న విషయాల్ని తాజాగా విడుదలైన కాగ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెలుగు చూసే అంశాల్ని చూస్తే నోట మాట రాదంతే.
కేసీఆర్ గొప్పగా చెప్పుకున్న గొర్రెల పంపిణీ పథకం అమలు ఎంత లోపభూయిష్టంగా.. ఎంత ఆరాచకంగా సాగిందన్న విషయాల్ని కళ్లకు కట్టినట్లుగా కాగ్ ఆధారాలతో సహా ప్రస్తావించిన వైనం సంచలనంగా మారింది. టూవీలర్ మీద ఒక గొర్రెను తీసుకెళ్లటం మనం చూసేదే. అయితే.. కొందరు రెండింటిని కూడా తీసుకెళతారు. కానీ.. అవి చిన్నవి అయితే పట్టుకోవటం ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ.. ఒక బైక్ మీద ఒకేసారి 126 గొర్రెల్ని తరలించటం సాధ్యమవుతుందా? అని ఎవరిని అడిగినా పిచ్చిగా చూడటం ఖాయం. దీనికి మళ్లీ అడగాలా? అని కూడా ముఖానే అనేస్తారు.
కానీ.. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో చోటు చేసుకున్న సిత్రాలు ఎంతలా ఉన్నాయన్న దానికి నిదర్శనంగా తాజాగా విడుదల చేసిన కాగ్ రిపోర్టులో ఈ అంశాల్ని పేర్కొన్నారు. గొర్రెల్ని తరలించినట్లుగా ఏదో ఒక వాహనం నెంబర్లు వేసేసి.. బిల్లులు దండుకున్న ఆరాచకాన్ని కాగ్ ఎండగట్టింది. ఈ పథకం అమలుకు ఏడు జిల్లాల్లో కాగ్ విచారణ చేపడితే షాకింగ్ నిజాలు వెలుగు చూసినట్లుగా కాగ్ తన రిపోర్టులో పేర్కొంది. భారీగా గొర్రెల్ని పంపిణీ చేసినట్లుగా చూపించారని.. కానీ వాస్తవంలో గొర్రెలే లేవని తేల్చారు.
ఈ పథకం కింద రూ.3385 కోట్లు ఖర్చు పెట్టగా.. భారీగా చోటు చేసుకున్న అవకతవకల కారణంగా ఆశించినంత ఫలితం రాలేదని పేర్కొంది. అక్రమాలేఎక్కువగా ఉన్నాయని కాగ్ పేర్కొంది. ఈ అక్రమాలపై విచారణ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. తీవ్రమైన అవకతవకలకు పాల్పడిన వారిని బాధ్యులుగా చేస్తూ వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని.. మోసపూరితంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారి నుంచి నిధులను రికవరీ చేయాలని కోరింది. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు పేర్కొంది.
- ఒకే వాహనాన్ని ఒకే రోజు రెండు భిన్న ప్రాంతాల నుంచి గొర్రెలను తరలించినట్లుగా చూపారు. మహబూబ్ నగర్ జిల్లాలో రిత్విక్ లాజిస్టిక్స్ సంస్థ నుంచి 2018 ఆగస్టు 4న ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నుంచి తెలంగాణలోని మక్తల్ మండలానికి ఏడు యూనిట్ల గొర్రెల్ని దించినట్లుగా పేర్కొన్నారు. ఇందుకోసం 927కిమీ ప్రయాణించినట్లుగా పేర్కొన్నారు. అదే వాహనం 2018 ఆగస్టు 4, 5 తేదీల్లో ఏపీలోని కడప జిల్లా పోరుమామిళ్ల నుంచి మహబూబ్ నగర్ జిల్లా రామచంద్రాపూర్ కు 8 యూనిట్ల గొర్రెల్ని తరలించినట్లుగా చూపారు. ఒకే వాహనం ఏపీలోని రెండు వేర్వేరు ప్రాంతాల నుంచి గొర్రెల్ని డెలివరీ చేయటం ఏమిటో?
- మరో వాహనం గొర్రెల తరలింపుకోసం కేవలం రెండు రోజుల వ్యవధిలో 74364 కి.మీ. ప్రయాణించినట్లుగా పేర్కొన్నారు. ఇదసలు సాధ్యమేనా? అని కాగ్ సైతం విస్మయానికి గురైంది.
- మూడేళ్ల క్రితం చనిపోయిన రైతును లబ్థిదారుడిగా చూపించారు.
- దాదాపు 20 మంది రైతులు తాము చనిపోయిన 18 - 36 నెలల వ్యవధిలో గొర్రెల యూనిట్లను తీసుకున్నట్లుగా రికార్డుల్లో నమోదు చేసినట్లుగా కాగ్ పేర్కొంది.
- తాము పరిశీలించిన రికార్డులప్రకారం దాదాపు 70 శాతం గొర్రెల యూనిట్లు పంపిణీ కాలేదన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది కాగ్.