కేసీఆర్ నోట 'ప్రధాని'మాట వెనుక అసలు వ్యూహం ఇదేనా?

తాజా ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. రాష్ట్రంలో అధికారంలో లేకపోవటం.. తమకు వచ్చే పరిమిత సీట్లతో ఏం చేయలేని పరిస్థితి.

Update: 2024-05-12 05:28 GMT

'ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు'గా ఉంది గులాబీ బాస్ కేసీఆర్ మాట. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన శనివారం మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఈ సందర్భంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసేలా తాను ప్రధాని రేసులో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. నిజానికి తాజాగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఒక్రటెండు స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదని.. ఆ మాటకు వస్తే ఆ మాత్రం సీట్లు కూడా వచ్చే వీల్లేదన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. కేసీఆర్ నోటి నుంచి ప్రధాని రేసు మాట రావటం వెనుక అసలు లెక్కలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఏదో ఒక భావోద్వేగ అంశాన్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా లబ్ధి పొందే వ్యూహాన్ని అమలు చేయటం తెలిసిందే. తాజా ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. రాష్ట్రంలో అధికారంలో లేకపోవటం.. తమకు వచ్చే పరిమిత సీట్లతో ఏం చేయలేని పరిస్థితి. అయినప్పటికీ.. పన్నెండుస్థానాలు తమకు ఇస్తే రాష్ట్ర రాజకీయాల్ని మారుస్తామంటూ బీఆర్ఎస్ ప్రచారం చేసింది. ఆ మాటకు పెద్ద సానుకూలత వ్యక్తం కాలేదు. కేసీఆర్ సైతం తాము 12-14 సీట్లలో గెలిచే వీలుందని చెబుతున్నారు. ఏ మాత్రం సాధ్యం కాదన్న విషయాన్ని ఇట్టే జరిగిపోతుందన్నట్లుగా చెప్పే కేసీఆర్ తీరు కామెడీగా మారిందని చెప్పాలి.

చేతిలో అధికారం ఉండి.. తిరుగులేని అధిక్యత ఉన్న వేళలో జరిగిన ఎన్నికల్లో (2019)లో సారు.. కారు.. పదహారు అంటేనే.. సీట్లు రాలని పరిస్థితి. అన్ని ఉన్నప్పుడే సాధ్యం కానిది.. ఇప్పుడున్న ఇబ్బందికర పరిస్థితుల్లో 12-14 సీట్ల మాట అత్యాశగా చెప్పాలి. ''అన్ని సీట్ల వరకు ఎందుకు? ఐదు సీట్లను కేసీఆర్ గెలుచుకుంటే అదో అద్భుతమవుతుంది'' అన్న మాటను పలువురు రాజకీయ నేతలు చెబుతున్నారు. తమకు లేని బలాన్ని తన మాటలతో ఉన్నట్లుగా చూపే ప్రయత్నం ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ స్థాయిని మరింత దెబ్బ తీసేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దీంతో.. ఓట్లు అడగటానికి సరైన కారణం కనిపించని పరిస్థితి. అలా అని మొదట్నించి ప్రధాని రేసు మాట చెప్పినా.. ప్రజలు నవ్వుతారు. అందుకే.. సరైన సమయంలో.. సరైన వేదిక మీద తన మనసులోని ఆలోచనను చెప్పే ప్రయత్నం చేశారని చెప్పాలి. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన ప్రధాని రేసు మాటకు ఏదైనా లాజిక్ ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకుంటే.. ఆయనకు సత్ సంబంధాలు ఉన్న పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది ఆమ్ ఆద్మీ.. సమాజ్ వాదీ పార్టీతో పాటు.. జనతాదళ్ తో పాటు అవసరానికి అండగా నిలిచే స్నేహితులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు.

వీరు మినహా ఇంకెవరూ కేసీఆర్ పక్షాన నిలిచే వీల్లేదు. ఇక్కడే ఇంకో విషయాన్ని చెప్పాలి. కేసీఆర్ కు మహా అయితే ఐదు కంటే తక్కువ సీట్లు వచ్చే వీలుంది. నిజానికి ఆ మాత్రం సీట్లు కూడా రావన్న మాటను ఇతర పార్టీల వారు కాదు సొంత పార్టీకి చెందిన వారు సైతం తమ ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు. అలాంటప్పుడు ఏ కోణంలో తాను ప్రధానమంత్రి రేసులో ఉన్నారని కేసీఆర్ చెబుతారన్నది ప్రశ్న.

అయితే.. ఓటర్లను ఆకట్టుకోవటానికి.. మన సారూ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని మనం ఇద్దామన్న భావన కలిగించేందుకు వీలుగా ప్రచార ఆఖరి క్షణంలో తీసుకొచ్చారని చెప్పాలి. ముందే కానీ ఈ మాటను చెప్పి ఉంటే.. కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులు ఒక ఆట ఆడుకునే వారు. అందుకే తెలివిగా ఆ అంశాన్ని ఆఖరు రోజున తెర మీదకు తీసుకొచ్చారని చెప్పాలి. ఈ మాటతో అయినా..తాము గెలిచేందుకు వీలున్న ఒకట్రెండు స్థానాల్ని దక్కించుకోవచ్చని.. అలా అయినా పరువు నిలుపుకోవచ్చన్నది గులాబీ బాస్ ఆలోచనగా చెబుతున్నారు. మొత్తంగా ప్రధాని రేసు మాట కేసీఆర్ నోటి నుంచి రావటం ద్వారా తెలంగాణ ప్రజల మధ్య కొత్త చర్చకు తెర తీసే విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పాలి.

Tags:    

Similar News