తన కూతురు కోసం కేసీఆర్‌ రహస్యంగా ఉంచిన సీటు ఇదేనా?

ఎట్టకేలకు తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అధికార పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైంది

Update: 2023-08-22 08:01 GMT

ఎట్టకేలకు తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అధికార పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. మొత్తం 119 స్థానాలకు గానూ 115 స్థానాలకు ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించారు. మరో నాలుగు స్థానాలను ఖాళీగా ఉంచారు. వీటికి ఎవరినీ అభ్యర్థులుగా ప్రకటించలేదు.

మరోవైపు కేసీఆర్‌ రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ తోపాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని కామారెడ్డి నుంచి కేసీఆర్‌ బరిలోకి దిగుతున్నారు.

కాగా కేసీఆర్‌ ప్రకటించిన జాబితాలో ఆయన కుటుంబంలో నుంచి ముగ్గురికి సీట్లు దక్కాయి. కేసీఆర్‌ తోపాటు ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్‌ రావు సీట్లు దక్కించుకున్నారు. కేసీఆర్‌ కుమార్తె కవిత కూడా ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తుందని.. ఆమెకు కూడా సీటు కేటాయిస్తారని ప్రచారం జరిగినా ఇది వాస్తవం కాలేదు.

అయితే.. కేసీఆర్‌ తన కుమార్తె కవితకు రహస్యంగా ఒక సీటు కేటాయించారని ప్రచారం జరుగుతోంది. ఆ సీటు మరేదో కాదని.. కేసీఆర్‌ పోటీ చేయబోతున్న కామారెడ్డేనని చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ గజ్వేల్‌ తోపాటు కామారెడ్డిలో గెలుపొందితే ఏదో ఒక సీటుకు రాజీనామా చేయకతప్పదు. అప్పుడు ఆయన కామారెడ్డికి రాజీనామా చేస్తారని అంటున్నారు. అక్కడ నుంచి తన కుమార్తె కవితను ఉప ఎన్నికలో పోటీ చేయిస్తారని చెబుతున్నారు. కేసీఆర్‌ రాజీనామా చేస్తే కామారెడ్డి ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వయంగా ఆయన తన కుమార్తెను బరిలోకి దించుతారని.. ఇక్కడ పోటీ చేసేది తన కుమార్తె కవితే కాబట్టి మీకు అండగా ఉంటుందని కామారెడ్డి ప్రజలకు భరోసా ఇస్తారని టాక్‌ నడుస్తోంది.

మరోవైపు కామారెడ్డిలోనూ కేసీఆర్‌ గెలుపు అంత నల్లేరు మీద నడక కాదని అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ కు మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ రూపంలో గట్టి అభ్యర్థి ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మంత్రిగా పనిచేసిన షబ్బీర్‌ అలీని ఢీకొట్టడం సులువు కాదంటున్నారు. అలాగే బీజేపీ తరఫున కామారెడ్డిలో ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముక్కోణపు పోరులో కేసీఆర్‌ గెలవడం.. మళ్లీ రాజీనామా చేసి తన కుమార్తెను బరిలోకి దించడం అంత ఈజీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News