కేశినేని నాని కొత్త ట్విస్ట్ ...నచ్చిన రూటు ?
అటువంటి విజయవాడ నుంచి 2014, 2019లలో రెండు సార్లు ఎంపీగా గెలిచిన వారు కేశినేని నాని. ఆయన టీడీపీ నుంచి ఈ ఘన విజయం సాధించారు.
విజయవాడ వంటి ప్రతిష్టాత్మకమైన లోక్ సభ స్థానానికి రెండు సార్లు ఎంపీగా పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి ఎంతో జనాదరణ బలమైన పార్టీ నేపథ్యం ఉండాలి. ఎందుకు అంటే విజయవాడ ఆషామాషీ నగరం కాదు, రాజకీయ చైతన్యం నిండుగా ఉన్న సిటీ. అంతే కాదు రాజకీయ రాజధానిగా పేరు.
అటువంటి విజయవాడ నుంచి 2014, 2019లలో రెండు సార్లు ఎంపీగా గెలిచిన వారు కేశినేని నాని. ఆయన టీడీపీ నుంచి ఈ ఘన విజయం సాధించారు. ఆయనకు పార్టీ ఎంతో విలువ ఇచ్చింది. అయితే ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలలో తాను ఎంతో గ్రేట్ అనుకున్నారని చెబుతారు. వైసీపీ వేవ్ ని తట్టుకుని మరీ గెలిచిన తనకు పార్టీ కంటే ఎక్కువ జనాదరణ ఉందని భ్రమించారు అని అంటారు.
మొత్తానికి ఆయన గత అయిదేళ్ళ ఎంపీ పదవిలో టీడీపీ అధినాయకత్వంలో గ్యాప్ పెంచుకున్నారని అంటారు. ఆయన స్వయంకృతాపరాధం అని అంటారు. ఆయన టీడీపీలో ఉండి ఉంటే ఈపాటికి మూడవసారి వరుసగా విజయవాడ నుంచి గెలిచి హ్యాట్రిక్ ఎంపీగా ఉండడమే కాదు కేంద్ర మంత్రిగా కూడా కీలక స్థానంలో ఉండేవారు అని అంటారు.
ఆయన పార్టీకి దూరమై వైసీపీలో చేరి 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. దాంతో ఆయన ఓటమి పాలు అయిన తరువాత తనకొద్దీ రాజకీయం అని గుడ్ బై కొట్టేశారు. ఇది జరిగి ఎనిమిది నెలలు పై దాటుతోంది. కేశినేని నాని ఊసు అయితే ఎక్కడా లేదు.
ఆయన ఇక ఇంతే కాబోలు అని అంతా అనుకున్నారు. కానీ సడెన్ గా ఆయన తెరపై ప్రత్యక్షం అయ్యారు. నందిగామలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల నుంచి తప్పుకున్నాను కానీ ప్రజా సేవ నుంచి కాదని కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అంటే తాను ఇక మీదట ప్రజలలో ఉండి ప్రజా సేవ చేస్తాను అని చెబుతున్నారన్న మాట.
అంతే కాదు తనకు విజయవాడ అంటే పిచ్చి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రెండు సార్లు ఎంపీగా విజయవాడ చేసింది అని అన్నారు. నగరాభివృద్ధికి తన వంతుగా పాటుపడతాను అని ఆయన అంటున్నారు. ఇక ఎవరి వల్ల కాదు, ఎప్పటికీ అసాధ్యం అనుకున్న దుర్గ గుడి ఫ్లై ఓవర్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి మాట్లాడి నిజం చేశాను అని ఆయన చెప్పారు.
ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో తాను చేసినా వాటిని వాటిని విస్మరించారని కేశినేని నాని ఆవేదన వ్యక్తం చేశారు. తాను నిజాయితీ పరుడిని అని తన రాజకీయ జీవితంలో ఎవరి దగ్గరా కప్పు కాఫీ తాగలేదని అంత నిబద్ధతతో పనిచేశాను అని నాని చెప్పుకున్నారు.
మొత్తం మీద నాని మళ్ళీ జనంలోకి వచ్చారు. మరి ఆయనకు విజయవాడ అంటే పిచ్చి, ప్రజా సేవ చేస్తాను అని అంటున్నారు. ప్రజా సేవకు పర్యాయపదం రాజకీయాలే. పైగా ఆయన రాజకీయ నేతగా చాలా ఏళ్ళు ఉన్నారు. దాంతో ఆయన తొందరలో రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశిస్తారా అన్న చర్చ సాగుతోంది. ఇక ఆయన తాను కాదు అనుకున్నా తన కుమార్తె కేశినేని శ్వేతను అయినా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేలా చూస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.
ఆమెకు ఎంతో భవిష్యత్తు ఉంది. ఆమె 2021లో టీడీపీలో మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయబడ్డారు. బ్యాడ్ లక్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. ఇక మళ్లీ లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి అందువల్ల కుమార్తెను టీడీపీ వైపుగా పంపుతారా లేక తానూ అందులో చేరుతారా లేక వేరే ఏవైనా వ్యూహాలు ఉన్నాయా అన్న హాట్ డిస్కషన్ అయితే సాగుతోంది. చూడాలి మరి కేశినేని ప్రజా సేవ పిచ్చి ఏమి చేయిస్తుందో.