సీఎం జగన్ మెడలో ఎంపీ కేశినేని కండువా.. దాని ప్రత్యేకత ఏమంటే?

టీడీపీ సీనియర్ నేత.. విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని అధికార వైసీపీలో చేరటం తెలిసిందే.

Update: 2024-01-11 05:41 GMT

టీడీపీ సీనియర్ నేత.. విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని అధికార వైసీపీలో చేరటం తెలిసిందే. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఒక ఆసక్తికర అంశం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. అయితే.. మీడియా.. సోషల్ మీడియాలో మాత్రం దీనిపై పెద్ద ఫోకస్ పడలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై గుర్రుగాఉన్న కేశినేని నాని.. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పేసి.. అధికార వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

ఇందులో భాగంగా గురువారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోమన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ విషయాలు ఏమిటన్న దానిపై వివరాలు రానప్పటికీ.. అనంతరం.. మీడియాకు విడుదల చేసిన రెండు ఫోటోలు.. చిన్న వీడియో క్లిప్ లో ఆసక్తికర అంశం కనిపించింది. సాధారణంగా పార్టీలో చేరే సందర్భంలో కానీ.. పార్టీలో చేరబోయే సమయంలో కానీ.. పార్టీ అధినేత.. సదరు నేత మెడలో కండువా కప్పటం కనిపిస్తుంది. ఒకవేళ.. స్నేహపూర్వకంగా కలిసిన సందర్భంలోనూ ఆయా పార్టీల రంగులకు దగ్గరగా ఉండే పూల బొకే దగ్గర నుంచి.. కండువాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు.

అందుకు భిన్నంగా తాజా ఎపిసోడ్ లో మాత్రం సీఎం జగన్ మెడలో మర్యాదపూర్వకంగా వేసిన కండువా.. గోధుమ రంగు (లైట్ పసుపు రంగులో) ఉండటం ఆసక్తికరంగా మారింది. మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. పార్టీ అంశాలకు సంబంధించి నీలం రంగుకు సీఎం జగన్ ఎంతటిప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి విషయాన్ని కేశినేని నాని ఎలా మిస్ అయ్యారన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ మెడలో వేసిన కండువాతో పాటు.. ఆయనకు ఇచ్చిన బొకే సైతం వైట్ కలర్ లో ఉండటం గమనార్హం

Tags:    

Similar News