బెజవాడ జంక్షన్ లో పొలిటికల్ టెన్షన్... నానీ వెంట వెళ్లేదెవరు?

ఏపీలో రాజకీయాలు రసకందాయంలో పడుతున్న సంగతి తెలిసిందే. రకరకాల ట్విస్టులు, జలక్కులతో ప్రతీరోజూ క్లైమాక్స్ లా ఉంటుంది.

Update: 2024-01-11 08:30 GMT

ఏపీలో రాజకీయాలు రసకందాయంలో పడుతున్న సంగతి తెలిసిందే. రకరకాల ట్విస్టులు, జలక్కులతో ప్రతీరోజూ క్లైమాక్స్ లా ఉంటుంది. ఈ క్రమంలో ఎవరు ఎప్పుడు ఏపార్టీలో ఉంటారనేది ఒకపట్టాన్న సామాన్య మానవుడికి అర్ధమవ్వనట్లుగా మారిపోయింది పరిస్థితి అన్నా అతిశయోక్తి కాదు! ఈ క్రమంలో నిన్న ఒక్కరోజే ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరిగాయి. ఇందులో ప్రధానంగా కేశినేని నాని వ్యవహారం చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే.

అవును... నిన్న ఒక్కరోజే ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో వైసీపీలో జాయిన్ అయ్యి పట్టుమని పదిరోజులు కూడా ఉండకుండానే.. దుబాయ్ లో క్రికెట్ మ్యాచ్ ఉందని ఆ పార్టీకి రాజీనామా చేసిన క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు... జనసేన అధినేత పవన్ తో భేటీ అయ్యారు.

అనంతరం కొన్ని గంటల్లోనే ఆ సస్పెన్స్ ను బ్రేక్ చేస్తూ ట్వీట్ చేశారు. శ్రేయోభిలాషులు, స్నేహితులు కలవమంటే కలిశానే తప్ప మరో ఆలోచన లేదన్నట్లుగా రాసుకొచ్చారు. దుబాయ్ వెళ్తున్నట్లు ప్రకటించారు. ఆ రెండు సంఘటనలూ ఒకెత్తు అయితే... విజయవాడ ఎంపీ కేశినేని నానీ.. జగన్ తో భేటీ అయ్యారు. అనంతరం మైకులముందుకు వచ్చి పలు సంచలన విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా "చంద్రబాబు మోసగాడని తెలుసు కానీ ఇంతపచ్చి మోసగాడు అని అనుకోలేదు"... "ఆఫ్ట్రాల్ లోకేష్.. ఎంపీగా గెలిచాడా, ఎమ్మెల్యేగా గెలిచాడా" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో మరికొంతమంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పకుండానే "క్యారెక్టర్ లెస్ ఫెలో" అని సంభోదించారు. వెంటనే టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, దేవినేని ఉమా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు! నానీపై ఫైర్ అయ్యారు!

ఆ సంగతి అలా ఉంటే... త్వరలో వైసీపీలో జాయిన్ అవుతాను అని చెబుతున్న కేశినేని నానీకి విజయవాడ లోక్ సభ టిక్కెట్ కన్ఫాం అయ్యిందని అంటున్నారు. ఇదే సమయంలో ఆయన కుమార్తె శ్వేత కు కూడా అసెంబ్లీ టిక్కెట్ అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సమయంలో కృష్ణాజిల్లా టీడీపీలో కేశినేని నానీతోపాటు వైసీపీ కండువా కప్పుకునేది ఎవరెవరు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

జగన్ తో భేటీ అనంతరం మీడియా ముందు స్పందించిన నానీ... 60శాతం టీడీపీ ఖాళీ అయిపోద్ది అని అన్నారు. దీనిపై స్పందించిన టీడీపీ నేతలు అంత సీన్ లేదన్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే.. నానీ మాత్రం ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలు, కసరత్తులు చేస్తున్నారని అంటున్నారు. వీలైనంతమంది ఎమ్మెల్యేస్థాయి నేతలతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలను సైతం తనవెంట బలంగా తీసుకుని ఫ్యాన్ కిందకు చేరాలని భావిస్తున్నారని.. ఈ మేరకు అనుచరులతో చర్చలు మొదలుపెట్టారని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో... తాను కేశినేని నానీ వెంట వెళ్తానని తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ స్పష్టం చేశారు. మరోవైపు బొమ్మసాని సుబ్బారావు, గన్నె ప్రసాద్, ఎంఎస్ బేగ్ లు మాత్రం టీడీపీలోనే కొనసాగుతామని అన్నారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని తాను చెప్పినట్లుగా వీలైనంత ఎక్కువమంది నేతలను తనవెంట తీసుకుని వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఈ లిస్ట్ పైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News