విజయసాయి రాజీనామా వేళ... వైరల్ గా కేతిరెడ్డి కామెంట్స్!
ఈ సమయంలో వైసీపీ కీలక నేతల్లో ఒకరు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన పోస్ట్ ఈ సందర్భంగా ఆసక్తికరంగా మారింది.
వైసీపీ కీలక నేత, వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ పరిణామంపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ కీలక నేతల్లో ఒకరు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన పోస్ట్ ఈ సందర్భంగా ఆసక్తికరంగా మారింది.
అవును... వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పెడం.. ఈ క్రమంలో తాజాగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించడం, దాన్ని పెద్దల సభ ఛైర్మన్ జగదీప్ దన్ కడ్ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. సాయిరెడ్డి తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై అటు చంద్రబాబు, ఇటు షర్మిల స్పందించగా.. ఈ సమయంలో కేతిరెడ్డి ట్వీట్ పై చర్చ మొదలైంది.
ఇందులో భాగంగా... విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన షర్మిల... జగన్ కు ఏమీ చెప్పకుండా విజయసాయిరెడ్డి రాజీనామా చేయరని.. విజయసాయిరెడ్డి ఈ సమయంలో వైసీపీని వీడారంటే అది చిన్న విషయం కాదని.. ఇంతకాలం విజయసాయిని బీజేపీ దగ్గర ఉంచే కేసుల విచారణ సాగకుండా జగన్ చేశారని ఆరోపించారు.
మరోపక్క ఇదే విషయంపై తాజాగా స్పందించిన చంద్రబాబు... విజయసాయిరెడ్డి రాజీనామా అనేది వాళ్ల పార్టీ అంతర్గత సమస్య అని.. ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చని.. తాను ఆ విషయంపై ఇంతకుమించి కామెంట్ చేయనని అన్నారు. మరోపక్క... అందినకాడికి దోచుకుని, ఇప్పుడు అస్త్ర సన్యాసమా అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఈ సమయంలో విజయసాయిరెడ్డి నిజంగానే రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారా.. లేక, ఇది జగన్ వ్యూహాల్లో భాగమా.. అదీగాక, త్వరలో విజయసాయి కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందా.. గతంలో సుజనా చౌదరి, సీఎం రమేష్ చేసినట్లే చేయబోతున్నారా అనే చర్చలు సాగుతున్నాయి.
ఈ సమయంలో... "రాజకీయాల్లో ఏదీ అనుకోకుండా జరగదు" అంటూ ఓ ట్వీట్ కేతిరెడ్డి ఎక్స్ లో ప్రత్యక్షమైంది. ఇందులో భాగంగా... "రాజకీయాల్లో అనుకోకుండా ఏదీ జరగదు.. ఒకవేళ జరిగితే, అది ఆ విధంగా ప్లాన్ చే యబడిందని మీరు పందేం కూడా వేయవచ్చు" అని ఫ్రాంక్లిన్ డీ. రూజ్ వెల్ట్ కొటేషన్ ను పోస్ట్ చేశారు కేతిరెడ్డి.
దీంతో... ఈ ట్వీట్ ని, సడన్ గా రాజకీయాలకు గుడ్ బై అంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పోల్చి చూస్తూ స్పందిస్తున్నారు నెటిజన్లు. అంటే... విజయసాయిరెడ్డి రాజీనామా అనేది ప్లాన్ చేయబడిన ఓ ఆసక్తికర పరిణామమా అనే చర్చా తెరపైకి తెస్తున్నారు.
దీంతో.. దీనిపై కేతిరెడ్డి మరింత వివరంగా స్పందిస్తారా.. లేక, ఇచ్చిన హింటే ఎక్కువ అని ఇక్కడితో వదిలేస్తారా అనే కామెంట్లు దర్శనమిస్తున్నాయి. ఇదే సమయంలో... “మాస్టర్ ప్లాన్స్ ఫ్రమ్ జగన్” అనే కామెంట్లూ దర్శనమిస్తుండటం గమనార్హం!