‘సీజ్ ద షిప్’ ఎపిసోడ్ లో ఇప్పుడు డెమరేజ్ పంచాయితీ!
అందుకు భిన్నంగా పోర్టులో నౌకను ఎన్ని రోజులు నిలిపి ఉంచితే.. అన్ని రోజులకు షిప్ యాజమాన్యం డెమరేజ్ ఛార్జీలు వసూలు చేస్తుంది.
ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. అందునా పవన్ కల్యాణ్ లాంటి నేత నోటి నుంచి ఒక మాట వస్తే.. దాని ఎఫెక్టు ఇంతలా ఉంటుందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. కూటమి సర్కారును నిత్యం విమర్శించే వారు.. తప్పుల్ని వేలెత్తి చూపే వారు.. పవన్ మాటల్ని కామెడీగా తీసుకోవటం.. ఎటకారం చేయటం.. తప్పుడు ప్రచారం చేసినప్పటికి.. నిదానంగా పవన్ మాట పవర్ ఏమిటో ఇప్పుడు తెలుస్తుందని చెప్పాలి.
పేదలకు చేరాల్సిన పీడీఎస్ బియ్యం.. భారీ షిప్ ద్వారా విదేశాలకు వెళుతున్న వేళ.. ఆకస్మిక తనిఖీతో దిమ్మ తిరిగే షాకిచ్చిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. పనిలో పనిగా ‘సీజ్ ద షిప్’ అన్న మాట ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. రీల్ హీర్ మాదిరి రియల్ లైఫ్ లోనూ సీజ్ ద షిప్ అన్న ఆదేశంతో అసలుసిసలైన హీరోయిజాన్ని చూపించారు పవన్ కల్యాణ్. ఆయన మాటతో కాకినాడ పోర్టులో స్టెల్లా ఎల్ పనామా నౌక నిలిచిపోయింది. ముందస్తు ఒప్పందం ప్రకారం నిర్దేశించిన తేదీలోపు ఓడలో సరుకు లోడింగ్ పూర్తి చేసి ఎగుమతికి క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది.
అందుకు భిన్నంగా పోర్టులో నౌకను ఎన్ని రోజులు నిలిపి ఉంచితే.. అన్ని రోజులకు షిప్ యాజమాన్యం డెమరేజ్ ఛార్జీలు వసూలు చేస్తుంది. నవంబరు 28న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీజ్ ద షిప్ అన్న దేశంతో నౌకలోని బియ్యంతో పాటు.. షిప్ కూడా కాకినాడ పోర్టులో నిలిచిపోయింది. పవన్ ఆదేశాల్ని తక్కువ చేసి చూపటానికి రూల్ పుస్తకంలోని అంశాల్ని కొందరు చూపిస్తూ.. ఎగతాళి చేస్తున్నా.. అత్యున్నత స్థానంలో ఉన్న వారి నోటి నుంచి వచ్చే ఆదేశాల తీవ్రత ఎంతన్న విషయం తాజాగా తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ నోటి నుంచి ‘సీజ్ ద షిప్’ అన్న మాట వచ్చిన తర్వాత నౌకలోని 1320 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. దీన్ని అన్ లోడ్ చేసే ప్రక్రియ ఏదోలా ఆలస్యమవుతోంది. దీంతో ఈ నౌక పోర్టులోనే ఉండిపోయింది. నౌకను సీజ్ చేసే అధికారం రాష్ట్రానికి లేకున్నా.. ప్రత్యేక పరిస్థితుల్లో ఉండిపోయింది. సీజ్ చేసే సమయంలో.. అవసరమైతే ఈ అంశంపై కేంద్రంతో తాను మాట్లాడతానని పవన్ చెప్పటం తెలిసిందే. అందుకు తగ్గట్లే.. నౌక కాకినాడ పోర్టులో నిలిచిపోయింది.
ఇలా నిలిచిన నౌకకు ప్రతి రోజు డెమరేజ్ ఛార్జీలు పడతాయి. ఈ నౌక సామర్థ్యం 52 వేల మెట్రిక్ టన్నులు కాగా.. అందులో 28 కంపెనీలకు చెందిన 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉంది. నవంబరు 28 ముందే లోడింగ్ జరిగింది. మరో 14 వేల మెట్రిక్ టన్నులు లోడింగ్ చేయాల్సి ఉంది. అలాంటి వేళలోనే పవన్ ఎంట్రీ ఇచ్చారు. గడిచిన 39 రోజులుగా నౌక పోర్టులోనే ఉంది. ముందుగా ఇచ్చిన సమాచారం ప్రకారం నౌక క్లియరెన్స్ తేదీ తర్వాత నుంచి ప్రతి రోజుకు డెమరేజ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. అయితే.. ఈ డెమరేజ్ ను ఎవరు చెల్లించాలన్న దానిపై ఇప్పుడు ఎగుమతిదారుల మధ్య పంచాయితీ నడుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం డిసెంబరు 5 నుంచి డెమరేజ్ వేయటానికి స్టెల్లా యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రోజుకు దగ్గర దగ్గర 22వేల అమెరికా డాలర్లు డెమరేజ్ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. మన రూపాయిల్లో రూ.18.73 లక్షలుగా చెప్పాలి. అంటే.. తుపాను తదితర అంశాల్ని మినహాయించినా డెమరేజ్ రూపంలో రూ.7.11 కోట్లు చెల్లించాలి. నౌక నిలిచిపోవటానికి కారణమైన బాలాజీ ఎక్స్ పోర్ట్స్ కంపెనీదే కారణంగా కాబట్టి.. ఆ సంస్థనే డెమరేజ్ మొత్తం చెల్లించాలని చెబుతున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో డెమరేజ్ మొత్తాన్ని మినహాయింపుకోరినా షిప్పర్ అంగీకరించటం లేదంటున్నారు. దీంతో.. పవన్ నోటి నుంచి వచ్చిన సీజ్ ద షిప్ మాటకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందంటున్నారు.