17ఏ(1) రాజ్యాంగ బద్ధతపై పిటిషన్.. సుప్రీంలో కీలక వాదన!

ఇందులో భాగంగా... పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కీలక వాదనలు చేశారు.

Update: 2023-10-07 14:06 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాల నేపథ్యంలో... 17ఏ పై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సెక్షన్ 17ఏ వర్తిస్తున్నా తనను గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేశారంటూ సవాల్ చేస్తూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తాజాగా సుప్రీంలో 17ఏ(1) పై ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.

అవును... అవినీతి కేసులో ప్రభుత్వ ఉద్యోగిపై విచారణ ప్రారంభించే ముందు అధికార యంత్రాంగం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలనే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ(1) నిబంధన రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ ను వచ్చే నెల 20న విచారిస్తామని సుప్రీం తెలిపింది. ఇందులో భాగంగా... పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కీలక వాదనలు చేశారు.

అవును... అవినీతి నిరోధక చట్టం (పీసీఏ) సెక్షన్ 17ఏ(1) చెల్లుబాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ పై విచారణను నవంబర్ 20న విచారిస్తామని జస్టిస్ బివి నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌ లతో కూడిన ధర్మాసనం తెలిపింది. పిటిషనర్ ఎన్జీవో "సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్" తరపున న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఈ పిటిషన్ "చాలా ముఖ్యమైన అంశానికి" సంబంధించిందని ధర్మాసనానికి తెలిపారు.

అదేవిధంగా... ఈ షరతు వలన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశంతో పాటు, ముందస్తు అనుమతి రాకుండా లాబీయింగ్‌ చేసేందుకు సమయం కూడా నిందితుడికి లభిస్తోందని ప్రశాంత్ భూషణ్ తెలిపారు.

ఇదే సమయంలో "ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి అవినీతి కేసులో విచారణ జరగదని చెబుతున్న అవినీతి నిరోధక చట్టం సవరణకు ఇది సవాలు" అని అన్నారు. ఇదే సమయంలో... ప్రాసిక్యూషన్ కోసం అనుమతి ఉందని.. అయితే తాము దానిని సవాలు చేయడం లేదని, విచారణ లేదా విచారణకు అనుమతిని మాత్రమే సవాలు చేస్తున్నామని అని భూషణ్ అన్నారు.

Tags:    

Similar News